‘తనూజ రంజన్‌’ కేసులో వెలుగులోకి కీలకాంశాలు | Hyderabad: Jubilee Hills Tanuja Ranjan Case Latest Updates | Sakshi
Sakshi News home page

జైలు నుంచి కుట్ర చేసి ఆదేశాలు ఇచ్చిన కల్పన భర్త

May 15 2026 1:20 PM | Updated on May 15 2026 1:33 PM

Hyderabad: Jubilee Hills Tanuja Ranjan Case Latest Updates

ఇప్పటి వరకు ఆరుగురిని నిందితులుగా గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి వినయ్‌ రంజన్‌ రే భార్య తనూజను చంపి, భారీ దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్‌ కోసం నగర పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేరంలో ఆరుగురు నేరుగా పాల్గొన్నారని, మరొకరు పరోక్షంగా సహకరించారని గుర్తించారు.  

ఉత్తరాది జైల్లో కల్పన భర్త... 
నేపాల్‌ నుంచి వలసొచ్చిన కల్పనతోపాటు ఆమె భర్త ఉత్తరాదిలో కొన్ని నేరాలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన మరో నేపాలీ మహిళ ద్వారా వినయ్‌ రంజన్‌ రే తల్లికి సపర్యలు చేయడానికి చేరింది. రంజన్‌ తల్లి రెండు నెలల క్రితం చనిపోయినా, కల్పన మీద ఉన్న నమ్మకంతో పనిలో కొనసాగించారు. ఈమెకు రెండో అంతస్తులో అటాచ్డ్‌ బాత్‌రూమ్‌తో కూడిన గదిని ఇచ్చారు. ఉత్తరాదిలో చేసిన నేరంలో అరెస్టు అయిన కల్పన భర్త ప్రస్తుతం అక్కడి జైల్లో ఉన్నట్టు తెలిసింది. జైలు నుంచే ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా కల్పనతో సంప్రదింపులు జరిపాడని సమాచారం. ఇలా మెసెంజర్‌ ద్వారా రంజన్‌ ఇంట్లో దోపిడీకి స్కెచ్‌ వేసి, ఆ విషయాన్ని కల్పనకు చెప్పారు.  

రెండు రోజుల ముందు వచ్చిన ముగ్గురు  
ఇటీవల వినయ్‌ రంజన్‌ రే (Vinay Ranjan Ray) బెంగళూరు వెళ్లడంతో దోపిడీకి అదే అదునైన సమయంగా భావించిన కల్పన అదే విషయాన్ని తన భర్తకు చెప్పింది. అతడి సూచనల మేరకు నేపాల్‌కు చెందిన సుజన్‌ షాహి అలియాస్‌ సురేశ్‌ సాహి, గణేశ్‌ సాహి, భరత్, దేవేందర్‌ నేరం చేయడానికి రెండు రోజులు ముందు నగరానికి వచ్చారు. ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరు రైలు ద్వారా సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చి గోపాలపురం పరిధిలోని ఎంఎస్‌ హోటల్‌లో బస చేశారు. ఆ మర్నాడు మరో నిందితుడు వచ్చి వీరిని కలిశాడు. గురువారం ఈ హోటల్‌లో సోదాలు చేసిన పోలీసులు పలు రికార్డులు, నేరగాళ్లు ఇచ్చిన గుర్తింపు పత్రాల ప్రతులు, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను స్వాదీనం చేసుకున్నారు.  
  
ఆటోలో జూబ్లీహిల్స్‌ వరకు...
నేరం చేసిన రోజు కల్పన ఆదేశాల మేరకు ఈ ఐదుగురూ ఆటోలో ప్రశాసన్‌నగర్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడి సీసీ కెమెరాల్లో ఇద్దరి కదలికలు మాత్రమే ఉండగా, మిగిలిన చోట్ల ఐదుగురినీ పోలీసులు గుర్తించారు. నేరం చేసిన తర్వాత వీరు వేర్వేరుగా రైళ్లల్లోనే పారిపోయారని పోలీసులకు ఆధారాలు లభించాయి. కల్పన (Kalpana) సహా కొందరు సొత్తుతో నేపాల్‌కు చేరినట్టు భావిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి ఉత్తరాదిలోని వివిధ నగరాల్లో గాలిస్తున్న టీమ్స్, ఇండో–నేపాల్‌ బోర్డర్‌లోని వివిధ ప్రాంతాలు, ఇమ్మిగ్రేషన్‌ చెక్‌పోస్టుల వద్ద నిఘా ఉంచాయి.

పోలీసుల అదుపులో నేపాలీ మమత గ్యాంగ్‌? 
జవహర్‌నగర్‌: జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కౌకూర్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ మురళీమోహన్, విజయలక్ష్మీ నివాసంలో వారిని బంధించి ఆ ఇంట్లోనే దొంగతనం చేసిన నేపాలీ మమత గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మురళీమోహన్‌ నివాసంలో ఈ నెల 11న ఇంట్లో పనిచేసే నేపాలీ పనిమనిషి, నేపాల్‌కు చెందినవారు దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే.

జవహర్‌నగర్, ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నేపాలీ గ్యాంగ్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర సరిహద్దుల్లో పట్టుకున్నారని, అక్కడ కోర్టులో హాజరుపర్చిన తర్వాత వారిని హైదరాబాద్‌ తీసుకొస్తారని సమాచారం. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతి స్వయంగా పర్యవేక్షించి 10 ప్రత్యేక టీమ్‌లు రంగంలోకి దించి నేపాలీ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు.    

Advertisement
 
Advertisement
Advertisement