తెలంగాణ మాజీ మంత్రి చందూలాల్‌ కన్నుమూత

Former Minister Azmeera Chandulal Passes Away - Sakshi

ములుగు: మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ (67) కన్నుమూశారు. కొంతకాలం కిందట కిడ్నీలు విఫలమవగా, మార్పిడి చేసినా ఆరోగ్యం కుదుటపడలేదు. అప్పటి నుంచి డయాలసిస్‌పైనే ఆధారపడుతున్నారు. పది రోజుల కిందట వరకు బాగానే ఉన్నప్పటికీ, ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి 11 గంటలకు మృతి చెందారు. ప్రస్తుత ములుగు జిల్లా జగ్గన్నపేటలో 17 ఆగస్టు 1954న జన్మించిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా పలుమార్లు గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాల్లో పదవులు నిర్వర్తించారు. చందూలాల్‌కు భార్య శారద, కుమారుడు ప్రహ్లాద్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

సర్పంచ్‌గా మొదలైన ప్రస్థానం
జగ్గన్నపేటకు చెందిన చందూలాల్‌ తొలుత 1981లో సర్పంచ్‌గా గెలిచారు. 1982లో టీడీపీలో చేరిన ఆయన 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 1985లో ఎమ్మెల్యేగా గెలిచి.. అప్పటి ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ మంత్రిగా పనిచేశారు. 1989 ఎన్నికల్లో ఓటమి పాలై, 1994 ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో టీడీపీని వీడి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకుని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున విజయం సాధించిన చందూలాల్‌కు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కింది. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వయోభారంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాగా, 1996 మధ్యంతర లోక్‌సభ ఎన్నికల్లో, 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వరంగల్‌ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. కాగా చందూలాల్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. 

సీఎం కేసీఆర్‌ సంతాపం
మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చందూలాల్, ములుగు శాసనసభా స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా,  రెండుసార్లు వరంగల్ ఎంపీగా గెలుపొందారని, రెండుసార్లు మంత్రిపదవి చేపట్టి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన చందూలాల్ నూతన తెలంగాణ రాష్ట్రంలో తన మంత్రివర్గంలో గిరిజన సంక్షేమం, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. మాజీ మంత్రి చందూలాల్  మరణం పార్టీకి తీరనిలోటని అన్నారు. చందూలాల్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top