ఆర్టీసీలో గ్రాట్యుటీ గల్లంతు 

For the first time in the history of RTC gratuity has been imposed - Sakshi

జనవరి నుంచి దాని చెల్లింపులకు అడ్డంకులు 

ఆర్థిక ఇబ్బందులతో చరిత్రలో తొలిసారి చెల్లింపుల నిలిపివేత 

రిటైర్‌ అయిన వెంటనే చెల్లించాల్సిన బెనిఫిట్‌ కోసం ఎదురుచూపులు 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ చరిత్రలో తొలిసారి గ్రాట్యుటీకి గండిపడింది. పదవీవిరమణ పొందిన ఉద్యోగుల హక్కుగా పొందే ఈ గ్రాట్యుటీని ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపి నిలిపేసింది. గతంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా గ్రాట్యుటీని మాత్రం ఆపలేదు. గత జనవరి నుంచి వీటి చెల్లింపుల్లో ప్రతిష్టంభన నెలకొంది. డిసెంబర్‌లో పదవీ విరమణ పొందినవారికి కాస్తా ఆలస్యంగా చెల్లించారు.

జనవరి నుంచి రిటైర్‌ అవుతున్నవారికి చెల్లించే విషయంలో ఆర్టీసీ వెనకాముందు ఆడుతోంది. పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు ప్రావిడెంట్‌ ఫండ్, గ్రాట్యుటీలను వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. వారు రిటైర్‌ అయ్యే సమయానికల్లా సెటిల్‌మెంట్లను సిద్ధం చేస్తారు. కానీ, ఇప్పుడు మొదటిసారి గతి తప్పింది. ఒక్కో ఉద్యోగికి వారి బేసిక్‌ ఆధారంగా రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీ అందుతుంది.

ఆర్టీసీలో ప్రస్తుతం పింఛన్‌ విధానం లేనందున గ్రాట్యుటీ పెద్ద ఊరట, దాన్ని భవిష్యత్తు ఆసరాకు వీలుగా డిపాజిట్‌ చేసుకునేవాళ్లు, ఇంటి ప్రధాన అవసరాలకు వాడేవారు ఎక్కువగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు గ్రాట్యుటీ నిలిచిపోవటం, ఎప్పుడు విడుదలవుతుందో తెలియని అయోమయం నెలకొనటంతో రిటైర్‌ అవుతున్న ఉద్యోగులలో తీవ్ర ఆవేదన నెలకొంది. తక్కువ వేతనాలుండే శ్రామిక్, డ్రైవర్, కండక్టర్‌ కుటుంబాల్లో ఇప్పుడు గందరగోళం నెలకొంది.  

చివరి నెల వేతనం కూడా గల్లంతేనా.. 
ఆర్టీసీలో తొలి నుంచి రిటైర్‌ అయ్యేచివరి నెలవేతనం ఆలస్యంగా చెల్లిస్తూ వచ్చే పద్ధతి ఉంది. వారు జాయిన్‌ అయినప్పుడు నెల మధ్యలోనో, చివరలోనో విధుల్లో చేరినప్పుడు ఆ నెల మొత్తానికి అడ్వాన్సుగా పూర్తి మొత్తం చెల్లిస్తున్నారు. రిటైర్‌ అయ్యే చివరి నెల వేతనం నుంచి నాటి అడ్వాన్స్‌ మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. ఈ లెక్కలు చూసేందుకు సమయం పట్టనున్నందున ఓ నెల ఆలస్యంగా చివరి వేతనం చెల్లించేవారు.

ఇప్పుడు గ్రాట్యుటీతోపాటు ఆ నెల వేతనం చెల్లింపునకు కూడా ఆటంకం ఏర్పడింది. వెరసి ఇటు గ్రాట్యుటీ రాక, చివరి వేతనం అందక ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఇళ్లకు వెళ్తున్నారు. రిటైర్‌మెంట్‌ ఫంక్షన్‌రోజు కుటుంబసభ్యులను పిలిపించి సన్మానం చేసి సెటిల్‌మెంట్ల తాలూకు డబ్బు అందజేసి పంపించేరోజులు పోయి, ఖాళీ చేతులతో పంపటం ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆవేదనకు కారణమవుతోంది.  

ఆర్‌ఈఎంఎస్‌ సిబ్బందిలో అవగాహన లేక.. 
ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యం ఉచితంగా అందుతోంది. రిటైర్‌ అవగానే ఆ వెసులుబాటు నిలిచిపోతుంది. అప్పుడు సిబ్బంది హోదా ఆధారంగా రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు నిర్ధారిత మొత్తాన్ని వసూలు చేసుకుని ‘రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ మెడికల్‌ బెనిఫిట్‌ స్కీం(ఆర్‌ఈఎంఎస్‌)’లో సభ్యత్వం కలి్పస్తారు.

అప్పుడు వారికి తార్నాక ఆసుపత్రి ద్వారా మెరుగైన చికిత్సకు వేరే ప్రైవేటు ఆసుపత్రికి రిఫర్‌ చేస్తే రూ.4 లక్షల వరకు బిల్లు కవర్‌ అవుతుంది. ఆర్‌ఈఎంఎస్‌ సభ్యత్వం కోసం ఉద్యోగులు చెల్లించాల్సిన మొత్తాన్ని గ్రాట్యుటీ నుంచి మినహాయిస్తూ వస్తున్నారు. ఇప్పుడు గ్రాట్యుటీ నిలిచిపోవటంతో కొన్ని డిపోల్లో సంబంధిత సెక్షన్‌ ఉద్యోగులు ఆర్‌ఈఎంఎస్‌ సభ్యత్వం కోసం ఏర్పాట్లు చేయటం లేదు. కొన్నిచోట్ల మాత్రం, నిర్ధారిత మొత్తాన్ని తగ్గించి గ్రాట్యుటీ సెటిల్‌మెంట్‌ కోసం ఉన్నతాధికారులకు ఫైల్‌ పంపుతున్నారు. దీంతో కొన్ని డిపోల్లో రిటైర్‌ అయినవారికి ఆర్‌ఈఎంస్‌ సభ్యత్వం లభించటం లేదు.

ఏప్రిల్‌లో శుభకార్యాలు లేకపోవటంతో బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య కూడా తగ్గించి ఫలితంగా రోజువారీ టికెట్‌ ఆదాయం రూ.14.50 కోట్లు రావాల్సి ఉండగా, రూ.12 కోట్ల వద్దే ఆగిపోతోంది. ఇలాంటి తరుణంలో ఈ నెల తాలూకు జీతాల చెల్లింపు ఎలా అన్న విషయంలో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జీతాలకే దిక్కులేని తరుణంలో గ్రాట్యుటీ సెటిల్‌మెంట్‌ కష్టంగా మారింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top