సాగునీటి కోసం భగీరథ యత్నం
అడుగంటిన భూగర్భ జలాలు..ఎండిపోతున్న వరి పంట
వట్టిపోతున్న బోర్లు.. కొత్తవి వేసినా నీటి జాడేది?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆరుగాలం శ్రమించి వేసిన పంట కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతన్న తల్లడిల్లుతున్నాడు. భూగర్భ జలాలు అడుగంటిపోయి, బోర్లు ఎత్తిపోవ డంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయినా పట్టు వదలకుండా రూ.లక్షలు వెచ్చించి సాగునీటి కోసం ప్రయ త్నం చేస్తూనే ఉన్నాడు. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు చేయ ని ప్రయత్నం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా 51.48 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. పలు చోట్ల ప్రస్తుతం వరికోతలు కొనసాగుతుండగా, నల్లగొండ, మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు బోర్లు వేయిస్తున్నా నీరు పడకపోగా, అప్పుల్లో కూరుకుపోతున్నారు.
నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పొగిల్ల గ్రామ రైతులు సాగు నీటికి చేస్తున్న భగీరథ ప్రయత్నాలు. గ్రామంలో బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో దాదాపు 60 మంది రైతులు తమ పంట పొలాలు కాపాడుకునేందుకు నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో మోటార్లు పెట్టుకొని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలకు నీటిని తీసుకెళ్తున్నారు. చిన్న ట్రాన్స్‌ఫార్మర్, హైస్పీడ్ మోటారు, పైపులైన్, విద్యుత్ కోసం ఒక్కో రైతు రూ.8 లక్షల వరకు ఖర్చు చేశారు.
వాటర్ ట్యాంకర్‌తో వరి పొలానికి నీరు పెడుతున్న రైతు ఎల్లారెడ్డి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆయన ఎకరంన్నరలో వరి సాగు చేశారు. లోఓల్టేజీ కరెంటుతో నీరందక పంట వాడిపోతోంది. మండే ఎండలకు భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరులో నీరు సరిగ్గా రావడం లేదు. చేతికొచ్చే పంటను కాపాడుకునేందుకు రూ. 20 వేలు వెచ్చించి వాటర్ ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు.
ఎండిపోయిన వరి చేలో నిల్చున్న ఈయన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన ఆర్ల రాంరెడ్డి. తనకున్న ఆరెకరాల్లో వరి సాగు చేశాడు. ఇప్పటికే రూ.1.85 లక్షలు పెట్టుబడి పెట్టారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో మరో రూ.1.20 లక్షలు వెచ్చించి బోరు వేశాడు. అయినా నీరు పడలేదు. దీంతో ఇప్పటికే 3 ఎకరాల పంట ఎండిపోయింది. మిగిలిన వరి పంటను కాపాడుకునేందుకు రూ. 25 వేలు వెచ్చించి ట్యాంకర్లతో పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
మహిళా రైతు భగీరథ యత్నం
జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లికి (జి) మహిళా రైతు కన్న రాధిక తనకున్న ఆరెకరాల భూమిలో వేసిన వరి, మొక్కజొన్న పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఉన్న ఒక్క బోరుతో ఇబ్బంది అవుతుండటంతో మరో నాలుగు బోర్లు వేయించింది. అయినా వాటిల్లో నీరు పడలేదు. గత్యంతరం లేక రూ.3.40 లక్షలు వెచ్చించి పాత బోరుకే కిలోమీటరు లోతులో మరో 140 పైపులు వేయించి పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేసింది. అయినా నీరు సరిపోక రెండెకరాల వరి పంట ఎండిపోవడంతో వదిలేసి, మిగతా పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.
కాళేశ్వరం నీళ్లు రాక.. గోదావరి ఎండిపోయి
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గోదావరి తీరప్రాంత రైతులు అంతా గోదావరి జలాలపై ఆధారపడి వరి సాగు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలో లేకపోవడంతో నది ఎడారిలా మారింది. దీంతో గత్యంతరం లేక గోదావరి మధ్యలోనే బోర్లు వేసి, పైపుల ద్వారా నీటిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. అయినా ఒక్కోసారి బోర్లు కూడా ఎండిపోతుండటంతో అప్పులపాలు కావాల్సి వస్తోందని వాపోతున్నారు.
బోరు అడుగంటిపోవడంతో..
బోరు వట్టిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వాటిని దక్కించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రాములు తాను వేసిన వరి పంట ఎండిపోతుండటంతో ట్యాంకర్‌తో నీటిని అందిస్తున్నారు. ఒక్కో వాటర్ ట్యాంక్‌కు రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. రామాయంపేట మండలం రాయిలాపూర్‌లో మరోరైతు నర్సాగౌడ్ బోరుసైతం సైతం ఎండి పోవటంతో ట్యాంకర్‌ద్వారా నీటిని తెచ్చి పోస్తున్నారు.
రెండేళ్లలో ఎనిమది బోర్లలో చుక్క నీరు పడలే
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లికి చెందిన బద్దిపడగ అనిల్‌రెడ్డి అనే రైతు 12 ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంటను కాపాడుకునేందుకు రెండేళ్లలో 8 బోర్లు వేశాడు. ఒక్కదాంట్లో కూడా నీరు పడలేదు. యాసంగి సీజన్‌లో 10 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటను కాపాడుకునేందుకు సమీపంలో ఉన్న మినీ డ్యాం నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేసి కిలోమీటరున్నర మేర పైపు లైన్ వేసి నీటిని అందించాల్సి వస్తోందని వాపోయాడు.
నీటి కోసం రూ. 8 లక్షలకు పైగా వెచ్చించా
బోర్లు పడకపోవడంతో సాగర్ వెనుక జలాల నుంచి నీటిని తరలించేందుకు రూ.8లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.80 వేలు, మోటారుకు రూ.లక్ష, కేబుల్ వైర్‌కు రూ.లక్ష అవుతోంది. కృష్ణా అడుగుభాగం నుంచి నీటిని తోడేందుకు పైప్‌నకు రూ.1,05,000 వరకు ఖర్చు అవుతోంది. 3 కిలోమీటర్ల పొడవునా పైపులకు రూ. 4 లక్షలు, పైప్‌లైన్ గుంత తీసినందుకు జేసీ బీకి రూ.లక్ష, గుంతను మూసివేయించేందుకు రూ.30వేల ఖర్చు అవుతోంది. – జటావత్ మంగులాల్, పొగిళ్ల, చందంపేట, నల్లగొండ


