గ్రామంలో బ్యాంకు అధికారుల పోస్టర్లు.. ఊరు విడిచి వెళ్లిపోతున్నా!

Farmer Received Notice from Bank Officials to Repay Loan Jogipet - Sakshi

రుణం చెల్లించాలని బ్యాంకు అధికారుల నోటీసులు 

గ్రామంలో పోస్టర్లు వేయడంతో మనస్తాపం చెంది భార్యాబిడ్డలతో వెళ్లిపోయిన రైతు శంకర్‌రెడ్డి 

నిబంధనల ప్రకారమే భూమి వేలం వేస్తున్నామన్న అధికారి

జోగిపేట(అందోల్‌): బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక, అధికారుల వేధింపులు తట్టుకోలేక, రుణం తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ రైతు కుటుంబం బతుకుదెరువు కోసం పటాన్‌చెరువు శివారు ప్రాంతానికి పయనమైంది. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండల పరిధి కంసాన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రైతు ఆశిరెడ్డిగారి శంకర్‌ రెడ్డి  తెలిపిన ప్రకారం మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి గ్రామంలో తనకు 3.31 ఎకరాల పొలం ఉంది.

తన పొలంలో బోరు మోటర్, పైపులైన్‌ ఏర్పాటు కోసం 2016లో జోగిపేట కోఆపరేటివ్‌ బ్యాంకులో రూ.80 వేల రుణం తీసుకున్నాడు. పంట దిగుబడులు రాకపోవడం, ఇతరుల పొలాలను కౌలుకు తీసుకుని సాగుచేసినా దిగుబడులు రాలేదు. దీంతో అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో మరోచోట అప్పు చేసి రూ.40 వేలు చెల్లించాడు.  ప్రభుత్వ రుణమాఫీ చేస్తుందని ఆశగా ఎదురుచూసినా లాభం లేకుండా పోయింది. చేసిన అప్పు రూ.1.42 లక్షలకు చేరింది.

అప్పులు తీర్చడం కోసం ట్రాక్టర్‌ కూడా అమ్మేశాడు. ప్రస్తుతం వేసిన మొక్కజొన్న కూడా చేతికి రాకుండా పోయింది. బ్యాంకు అధికారులు పదే పదే ఇంటి చుట్టూ తిరుగుతూ నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈనెల 23వ తేదీన గ్రామంలో భూమి వేలం వేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. గ్రామంలో బకాయి ఉన్నట్లు పోస్టర్లు అంటించారు. ఒకవైపు అవమానం, మరోవైపు అప్పు తీర్చే మార్గం లేక భార్యాపిల్లలకు నచ్చజెప్పి ఊరు విడిచివెళ్లిపోయాడు.

రూ.1.42 లక్షలు చెల్లించాల్సి ఉంది
కన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు శంకర్‌రెడ్డి మోటారు కొనుగోలు కోసం, బోరు వేయించేందుకు రూ.80 వేలు 2016లో తీసుకున్నాడు. చాలాసార్లు గ్రామానికి వెళ్లి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఒకసారి రూ.40 వేలు చెల్లించాడు. ఇంకా రూ.1.42 లక్షలు బకాయి ఉంది. ఈనెల 23వ తేదీన ఆయన భూమిని వేలం వేస్తున్నట్లు ప్రకటన కూడా ఇచ్చాం. ఇందులో 70 నుంచి 80 శాతం చెలిస్తే కొంత సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పాం. పాత బకాయిలు పేరుకుపోవడంతో కొత్త రుణాలు ఇవ్వలేకపోతున్నాం. నిబంధనల ప్రకారమే రైతుకు నోటీసులు జారీ చేశాం. 
– రాజు, మేనేజర్‌ జోగిపేట డీసీసీబీ బ్రాంచ్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top