కోర్టు భవనంపై నుంచి దూకిన కుటుంబం | Family jumps from court house | Sakshi
Sakshi News home page

కోర్టు భవనంపై నుంచి దూకిన కుటుంబం

Jun 29 2025 4:22 AM | Updated on Jun 29 2025 4:22 AM

Family jumps from court house

భార్య మృతి.. భర్త, ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు

భర్తపైనే మృతురాలి బంధువుల అనుమానం  

మెదక్‌జోన్‌/మెదక్‌ కలెక్టరేట్‌/మెదక్‌ మున్సిపాలిటీ: అత్త, భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి శనివారం మెదక్‌ జిల్లా కోర్టుకు వచ్చాడు. కేసుకు హాజరైన అనంతరం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి కోర్టు భవనం మూడో అంతస్తు నుంచి దూకాడు. ఘటనలో భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఇద్దరు పిల్లలు, అతడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన డాకొల్ల నవీన్‌ ఐదేళ్ల క్రితం మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌ గ్రామానికి చెందిన రమ్య (24)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 

వీరికి మూడేళ్లలోపు ఆడపిల్లలు రుచిక, యశ్విక ఉన్నారు. గతేడాది నవీన్‌ తన అత్తగారిల్లు లక్ష్మాపూర్‌కు వచ్చి గొడవపడ్డాడు. ఈ క్రమంలో అత్త రాజమణి, భార్య రమ్యను చంపే ప్రయత్నం చేశాడు. ఈ కేసులో రామాయంపేటలో నవీన్‌పై హత్యాయత్నం కేసు నమోదుకాగా, జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో రమ్య సైతం నవీన్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇటీవలే లోక్‌అదాలత్‌లో ఈ కేసుపై వారిద్దరూ రాజీపడినట్లు పోలీసులు తెలిపారు. 

కాగా, అత్త, భార్యపై హత్యాయత్నం కేసు విషయమై శనివారం కోర్టుకు హాజరైన నవీన్‌.. భార్య పిల్లలతో కలిసి కోర్టు భవనంపైనుంచి దూకాడు. భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా నవీన్, పిల్లలు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన మెదక్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. అదనపు ఎస్పీ మహేందర్‌ ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, నవీనే భార్యాపిల్లలను చంపే కుట్రలో భాగంగా భవనంపైనుంచి తోసిఉంటాడని రమ్య కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. 

తల్లడిల్లుతున్న చిన్నారులు.. 
కాగా, బాలిక రుచికకు ఎడమ చేయి మూడు చోట్ల విరిగింది. ఛాతీలోనూ తీవ్ర గాయమైంది. ఏడాది న్నర వయసున్న యశ్విక నోట్లోని పళ్లన్నీ రాలిపో యాయి. తీవ్రగాయాలతో ఉన్న ఆ చిన్నారులను చూసిన వారంతా చలించిపోతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement