Hyd: నకిలీ టీ పొడి తయారీ ముఠా గుట్టురట్టు | Fake Tea Powder Racket Busted In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyd: నకిలీ టీ పొడి తయారీ ముఠా గుట్టురట్టు

Apr 23 2026 7:37 PM | Updated on Apr 23 2026 7:57 PM

Fake Tea Powder Racket Busted In Hyderabad

హైదరాబాద్‌:  నకిలీ టీ పొడి తయారీ ముఠా గుట్టురట్టు చేసింది హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్. నగరవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించింది. కల్తీ టీ పొడిని తయారుచేస్తూ, విక్రయిస్తున్న తయారీ కేంద్రాలే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అధిక లాభాల కోసం నిందితులు తక్కువ నాణ్యత గల టీ పొడికి కృత్రిమ రంగులు గడువు ముగిసిన ముడి పదార్థాలను కలిపి వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. 

ఈ కల్తీ పొడిని రోడ్డు పక్కన ఉండే టీ స్టాళ్లతో పాటు కొన్ని ప్రముఖ విక్రయశాలలకు కూడా సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో కొంపల్లికి చెందిన పరేశ్ రాజన్ (రంగుల సరఫరాదారు), పెట్లాబుర్జుకు చెందిన సంజు అలియాస్ పతి (రంగులు కలిపే వ్యక్తి), ముషీరాబాద్‌కు చెందిన సతీష్, బౌయిన్ పల్లికి చెందిన నవీన్, ఆసిఫ్ నగర్ కు చెందిన నరసింహ (250 గ్రాముల ఇల్లీగల్ ప్యాకెట్ల తయారీదారు), రాజేంద్రనగర్ కు చెందిన చున్నిలాల్ చౌదరి, బోరబండకు చెందిన నరసింహులు, పెట్లాబుర్జుకు చెందిన రాజేష్, బీదర్‌కు చెందిన రవీందర్ మరియు మల్లేపల్లికి చెందిన వసీం ఉన్నారు. వీరంతా రంగులు కలపడం, ప్యాకేజింగ్ మరియు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారించారు.

విచారణ వివరాల ప్రకారం, నిందితులు కోల్‌కతా, కేరళ మరియు అస్సాం వంటి రాష్ట్రాల నుండి తక్కువ నాణ్యత గల టీ పొడిని సేకరించి, దానికి ఆకర్షణీయమైన రంగు రావడానికి సన్‌సెట్ ఎల్లో, టార్ట్రాజైన్ వంటి హానికరమైన రంగులతో పాటు బెల్లం పాకం, వాడేసిన టీ పొడి మరియు ఎక్స్‌పైరీ అయిన టీ పొడిని కలుపుతున్నారు. ఈ హానికరమైన మిశ్రమాలను ప్రసిద్ధ బ్రాండ్ల పేరుతో రీ-ప్యాకేజింగ్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. ఇటువంటి కల్తీ టీ పొడి సేవించడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు, అలర్జీలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ దాడుల్లో సుమారు 3,000 కిలోల కల్తీ టీ పొడి, 1500 కిలోల ఎక్స్‌పైరీ టీ పొడి, 100 కిలోల బెల్లం మరియు భారీగా కృత్రిమ రంగులను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా ప్రజలకు ముఖ్య గమనిక జారీ చేస్తూ, టీ పొడిని కేవలం గుర్తింపు పొందిన విక్రేతల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ఆహార కల్తీకి సంబంధించి ఎటువంటి అనుమానం ఉన్నా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. తయారీదారులు ఆహార భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారతీయ న్యాయ సంహిత, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడులను టాస్క్ ఫోర్స్ డీసీపీ శ్రీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐ.పి.ఎస్. గారి పర్యవేక్షణలో, H-FAST ఇన్‌స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్ గౌడ్, ఎం. అంజయ్య మరియు వారి బృందం విజయవంతంగా నిర్వహించింది.

Advertisement
 
Advertisement
Advertisement