సంక్షేమ వసతి గృహాలపై పటిష్ట నిఘా | Face recognition system based attendance in every hostel | Sakshi
Sakshi News home page

సంక్షేమ వసతి గృహాలపై పటిష్ట నిఘా

Oct 8 2026 5:34 AM | Updated on Oct 8 2026 5:34 AM

Face recognition system based attendance in every hostel

విద్యార్థులు, సిబ్బంది వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే 

ప్రతి హాస్టల్‌లో ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టం ఆధారిత హాజరు

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ శాఖల పరిధిలోని వసతిగృహాల నిర్వహణను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేస్తోంది. ఇందులో భాగంగా యూనిఫైడ్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(యూడబ్ల్యూహెచ్‌ఎంఎస్‌)ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ నిర్వహిస్తోన్న ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ) ఐటీ విభాగం ప్రత్యేకంగా ఆదేశించింది. టీజీ ఆన్‌లైన్‌/ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా అమలు చేస్తున్న ఈ వ్యవస్థను వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ సంస్థల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రవి గుగులోతు తాజాగా సర్క్యులర్‌ జారీ చేశారు. 

ఆరు మాడ్యూళ్లతో పర్యవేక్షణ
యూడబ్ల్యూహెచ్‌ఎంఎస్‌లో భాగంగా హాస్టల్‌ నిర్వహణ, విద్యార్థుల నిర్వహణ, ఉద్యోగుల నిర్వహణ, మెస్‌ నిర్వహణ, ఆరోగ్య నిర్వహణ, ముఖ గుర్తింపు ఆధారిత హాజరు వ్యవస్థ అనే ఆరు మాడ్యూళ్లను ప్రారంభించారు. తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ సంస్థలతో పాటు ఎస్సీసీడీ, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం తదితర విభాగాల పరిధిలోని సంస్థల్లో ఈ వ్యవస్థను అమలు చేస్తారు. ఇందులో భాగంగా కృత్రిమ మేధ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు వ్యవస్థను కూడా అమలు చేస్తారు. 

దీనికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయని, ముఖ గుర్తింపు హాజరు వ్యవస్థ సెప్టెంబర్‌ 11 నుంచే అమల్లోకి వచ్చినట్లు సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. అయితే పలుచోట్ల ఇప్పటికీ అవసరమైన డేటా ఎంట్రీ, ప్రొఫైల్‌ నవీకరణ పనులు పూర్తికాలేదు. ప్రధానంగా హాస్టల్‌ ప్రొఫైళ్లు, విద్యార్థులు/బోర్డర్ల ప్రొఫైళ్లు, ఉద్యోగులు/సిబ్బంది ప్రొఫైళ్లను పూర్తి చేసి ధ్రువీకరించాల్సి ఉంది. వ్యవస్థను క్రమబద్ధీకరించి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు గత నెలాఖరును తుది గడువుగా నిర్ణయించినప్పటికీ... పెండింగ్‌లో ఉన్న చిన్నపాటి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement