ఎపిగ్రఫీ మ్యూజియం సిటీకి బదులు తిరుచ్చికి..? | Epigraphic Museum Shifts From Hyderabad To Trichy | Sakshi
Sakshi News home page

ప్రాంతం మార్పునకు ఢిల్లీలో చక్రం తిప్పుతున్న తమిళ ఉన్నతాధికారులు 

Sep 27 2022 4:12 AM | Updated on Sep 27 2022 8:02 AM

Epigraphic Museum Shifts From Hyderabad To Trichy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శనశాల (ఎపిగ్రఫీ మ్యూజియం)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ప్రక్రియకు ఆదిలోనే అవాంతరం ఎదురవుతోంది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆమోదించిన ప్రతిపాదనే బుట్టదాఖలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ మ్యూజియాన్ని హైదరాబాద్‌లో కాకుండా తిరుచ్చిలో ఏర్పాటు చేసేలా తమిళనాడుకు చెందిన కొందరు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)లో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులు, ఢిల్లీలోని మరికొందరు తమిళ ఐఏఎస్‌ అధికారులు ఈ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వెరసి.. భాగ్యనగరానికి మరింత పర్యాటక శోభ తీసుకు రావాల్సిన ప్రాజెక్టు కాస్తా మనకు దక్కకుండా పోయే పరిస్థితి నెలకొంది. 

తొలుత హైదరాబాద్‌లో ఏర్పాటుకు కసరత్తు..: దేశంలో శాసనాలకు ప్రత్యేకంగా మ్యూజియం లేదు. మైసూరు కేంద్రంగా ఏఎస్‌ఐలో భాగంగా శాసనాల విభాగం ఉంది. దీని పరిధిలో లక్నో, చెన్నై, నాగ్‌పూర్‌లలో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. మైసూరులో 75 వేల శాసనాలకు చెందిన నకళ్లు ఉన్నాయి. కానీ ప్రజలు సందర్శించేలా మ్యూజియం మాత్రం లేదు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో లభించిన శాసనాలను భద్రపరిచేందుకు, పర్యాటకులు వాటిని తిలకించేందుకు వీలుగా ఎపిగ్రఫీ మ్యూజియాన్ని హైదరాబాద్‌లో ఏర్పా టు చేయాలని చరిత్ర పరిశోధకులు గతేడాది కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. దీనికి ఆయన ఆమోదం తెలిపారు. దీంతో వెంటనే స్థానికంగా మ్యూజియం ఏర్పాటుకు వీలుగా కసరత్తు ప్రారంభమైంది. 

ఓ చిన్న పెవిలియన్‌తో సరిపెట్టేలా..: కానీ ఏఎస్‌ఐలో పనిచేసే తమిళనాడుకు చెందిన ఓ సీనియర్‌ అధికారి కేంద్ర మంత్రి ప్రతిపాదనకు గండికొట్టి ఎపిగ్రఫీ మ్యూజియాన్ని తమిళనాడులోని తిరుచ్చిలో ఏర్పాటు చేసే పని ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఎపిగ్రఫీ మ్యూజియం బదులు సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఓ చిన్న పెవిలియన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీంతో ఏఎస్‌ఐ తెలంగాణ సర్కిల్‌ అధికారులు సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ప్రతిపాదిత పెవిలియన్‌ కోసం 132 శాసన కాపీలను ప్రదర్శించేందుకు ఓ జాబితా రూపొందించారు. రూ. 20 లక్షలు వెచ్చించి పెవిలయన్‌ గ్యాలరీలు సిద్ధం చేశారు.

మైసూరులోని ఎపిగ్రఫీ డైరక్టరేట్‌లోని శాసన నకళ్లలో 23 వేలకుపైగా తమిళ భాషవే ఉన్నాయి. ఇప్పుడు వాటిని తమిళనాడుకు తరలించేందుకు ఆ అధికారులు తెరవెనక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత తిరుచ్చిలో జాతీయ మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది ఆ అధికారుల యోచన. అయితే దీన్ని అడ్డుకోవాలని చరిత్ర పరిశోధకులు కిషన్‌రెడ్డిని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో సమావేశం జరగనుంది. ఇందులో కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement