breaking news
tirucchi
-
ఎపిగ్రఫీ మ్యూజియం సిటీకి బదులు తిరుచ్చికి..?
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శనశాల (ఎపిగ్రఫీ మ్యూజియం)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ప్రక్రియకు ఆదిలోనే అవాంతరం ఎదురవుతోంది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆమోదించిన ప్రతిపాదనే బుట్టదాఖలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మ్యూజియాన్ని హైదరాబాద్‌లో కాకుండా తిరుచ్చిలో ఏర్పాటు చేసేలా తమిళనాడుకు చెందిన కొందరు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)లో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులు, ఢిల్లీలోని మరికొందరు తమిళ ఐఏఎస్ అధికారులు ఈ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వెరసి.. భాగ్యనగరానికి మరింత పర్యాటక శోభ తీసుకు రావాల్సిన ప్రాజెక్టు కాస్తా మనకు దక్కకుండా పోయే పరిస్థితి నెలకొంది. తొలుత హైదరాబాద్‌లో ఏర్పాటుకు కసరత్తు..: దేశంలో శాసనాలకు ప్రత్యేకంగా మ్యూజియం లేదు. మైసూరు కేంద్రంగా ఏఎస్ఐలో భాగంగా శాసనాల విభాగం ఉంది. దీని పరిధిలో లక్నో, చెన్నై, నాగ్‌పూర్‌లలో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. మైసూరులో 75 వేల శాసనాలకు చెందిన నకళ్లు ఉన్నాయి. కానీ ప్రజలు సందర్శించేలా మ్యూజియం మాత్రం లేదు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో లభించిన శాసనాలను భద్రపరిచేందుకు, పర్యాటకులు వాటిని తిలకించేందుకు వీలుగా ఎపిగ్రఫీ మ్యూజియాన్ని హైదరాబాద్‌లో ఏర్పా టు చేయాలని చరిత్ర పరిశోధకులు గతేడాది కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. దీనికి ఆయన ఆమోదం తెలిపారు. దీంతో వెంటనే స్థానికంగా మ్యూజియం ఏర్పాటుకు వీలుగా కసరత్తు ప్రారంభమైంది. ఓ చిన్న పెవిలియన్‌తో సరిపెట్టేలా..: కానీ ఏఎస్ఐలో పనిచేసే తమిళనాడుకు చెందిన ఓ సీనియర్ అధికారి కేంద్ర మంత్రి ప్రతిపాదనకు గండికొట్టి ఎపిగ్రఫీ మ్యూజియాన్ని తమిళనాడులోని తిరుచ్చిలో ఏర్పాటు చేసే పని ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఎపిగ్రఫీ మ్యూజియం బదులు సాలార్జంగ్ మ్యూజియంలో ఓ చిన్న పెవిలియన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీంతో ఏఎస్ఐ తెలంగాణ సర్కిల్ అధికారులు సాలార్జంగ్ మ్యూజియంలో ప్రతిపాదిత పెవిలియన్ కోసం 132 శాసన కాపీలను ప్రదర్శించేందుకు ఓ జాబితా రూపొందించారు. రూ. 20 లక్షలు వెచ్చించి పెవిలయన్ గ్యాలరీలు సిద్ధం చేశారు. మైసూరులోని ఎపిగ్రఫీ డైరక్టరేట్లోని శాసన నకళ్లలో 23 వేలకుపైగా తమిళ భాషవే ఉన్నాయి. ఇప్పుడు వాటిని తమిళనాడుకు తరలించేందుకు ఆ అధికారులు తెరవెనక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత తిరుచ్చిలో జాతీయ మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది ఆ అధికారుల యోచన. అయితే దీన్ని అడ్డుకోవాలని చరిత్ర పరిశోధకులు కిషన్‌రెడ్డిని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో సమావేశం జరగనుంది. ఇందులో కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. -
అక్క విషం తాగింది...చెల్లి పెళ్లికి సిద్ధమైంది!
చెన్నై(కేకే నగర్): ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని అక్క విషం తాగగా అదే ముహూర్తానికి వరుడితో పెళ్లికి చెల్లెలు సిద్ధమయింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఈ ఘటన జరిగింది. తురయూర్ సమీపంలో గల బట్టంపట్టికి చెందిన బాలకుమార్ (27) వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి సేలం జిల్లా సెందారపట్టికి చెందిన శరణ్య (20)తో వివాహం నిశ్చయమైంది. వీరికి బుధవారం తురయూరులో గల ఆలయంలో వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో మండపంలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీని కోసం మంగళవారం రాత్రి రిసెప్షన్ జరిగింది. బుధవారం ఉదయం పెళ్ళి కూతురు మండపానికి తీసుకురావాల్సిన స్థితిలో ఆమె విషం తాగి స్పృహతప్పి పడిపోయింది. దీనిపై ఆరాతీయగా ఆమెకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఇంకా పై చదువులు చదవాలని అనుకుంటున్నట్లు తెలిసింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. దీనిపై పెళ్ళికొడుకు తరపు వారు తురయూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపారు. రెండు కుటుంబాల వారితో చర్చలు జరిపారు. ఈ మేరకు పెళ్లి కూతురు చెల్లెలు సంగీత (18)ను ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అనంతరం సంగీత సమ్మతంతో బాలకుమార్, సంగీత వివాహం జరిగింది.