EAPCET Results: బాలికలదే పైచేయి | EAPCET Results released: Girls Tops in TGEAPCET | Sakshi
Sakshi News home page

EAPCET Results: బాలికలదే పైచేయి

May 18 2026 2:11 AM | Updated on May 18 2026 2:11 AM

EAPCET Results released: Girls Tops in TGEAPCET

ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల చేసిన కె.కేశవరావు

ఇంజనీరింగ్‌ టాపర్‌ రుషి.. టాప్‌–10లో ఇద్దరు ఏపీ విద్యార్థులు

గతేడాది కన్నా పెరిగిన అర్హత... వారంలోనే ఫలితాల వెల్లడి 

ఇంజనీరింగ్‌లో 73.36 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 86.27 శాతం మందికి అర్హత

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌)కు హాజరైన విద్యార్థుల్లో అత్యధిక మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన ఎం.రుషి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. మూసాపేటకు చెందిన అన్షుల్‌ రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ పులివెందులకు చెందిన ఎం.వంశీధర్‌ రెడ్డి మూడో స్థానం దక్కించుకున్నారు. ఇంజనీరింగ్‌లో 73.36 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 86.27% మంది ఉత్తీర్ణులయ్యారు. రెండు విభాగాల్లోనూ బాలికలదే పైచేయిగా ఉంది. ఈఏపీసెట్‌ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మే 4 నుంచి 11 వరకూ సీబీటీ విధానంలో జరిగాయి. ఆదివారం ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొ. వి. బాలకిష్టారెడ్డి నేతృత్వంలో జేఎన్‌టీయూహెచ్‌ ప్రాంగణంలో పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 2,10,766 మంది రిజిస్టర్‌ చేసుకోగా, 1,97,242 మంది పరీక్ష రాశారు. 1,44,704 మంది అర్హత సాధించారు. అగ్రి, ఫార్మా సెట్‌కు 90,977 మంది దరఖాస్తు చేస్తే, 84,954 మంది పరీక్ష రాశారు. వీరిలో 73,294 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌లో బాలురు 84.70 శాతం మంది అర్హత సాధిస్తే, బాలికలు 86.76 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితా రాణా, సాంకేతిక విద్య కమిషనర్‌ దేవసేన, జేఎన్‌టీయూహెచ్‌ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొ. టీకే రెడ్డి, రిజిస్ట్రార్‌ ప్రొ.వెంకటేశ్వరరావు, మండలి వైస్‌ చైర్మన్లు ప్రొ. ఇటిక్యాల పురుషోత్తం, ఎస్‌కే మహమ్మూద్‌ పాల్గొన్నారు.  

వారంలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ 
ఎప్‌సెట్‌ ఫలితాలు వెల్లడవ్వడంతో కాలేజీల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఈ నెలాఖరు నుంచి మొదలు పెడుతున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొ.బాలకిష్టారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.16 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 70 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. మిగతా సీట్లను యాజమాన్య కోటాలో భర్తీ చేస్తారు. ఏపీ విద్యార్థులు టాపర్లుగా నిలిచినప్పటికీ కౌన్సెలింగ్‌లో వారికి అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి.  

కన్వీనర్‌ అసలు హీరో 
కేవలం వారం రోజుల్లోనే ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల చేయడం మామూలు విషయం కాదని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అన్నారు. అదీ ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంతంగా ఫలితాలు వెల్లడించడం అభినందనీయమన్నారు. పరీక్షల్లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులే కాదు... సెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ విజయకుమార్‌ రెడ్డి కూడా హీరోనే అని కొనియాడారు. 




   

Advertisement
 
Advertisement
Advertisement