‘స్థానిక’ ఖాళీల భర్తీకి 8న ముసాయిదా ఓటర్ల జాబితా 

Draft Voters List To Fill Local Vacancies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివిధ పంచాయతీరాజ్, పురపాలక సంస్థల్లోని వివిధ స్థానాలకు ఏర్పడిన ఖాళీల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 8న ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించి, వాటిపై అభ్యంతరాలుంటే స్వీకరించాలని సంబంధిత పీఆర్, మున్సిపాలిటీ శాఖల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి ఆదేశించారు.

ఈ జాబితాలపై రాజకీయ పార్టీలప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరబాట్లు లేకుండా పక్కాగా తయారు చేస్తే ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు జరిగే అవకాశాలు ఉండవని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు, కౌన్సిలర్ల స్థానాల భర్తీకి సంబంధించిన ఓటర్ల జాబితాల తయారీపై సోమవారం వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో ఎస్‌ఈసీ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  

జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఓటర్ల జాబితా 
పార్థసారథి మాట్లాడుతూ 2022 జనవరి 1వ తేదీని ప్రాతిపదికగా తీసుకొని అదే నెల 6న ఈసీ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాల ఆధారంగా స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలను ఈ నెల 21న ప్రచురించాలని సూచించారు. వీటి తయారీలో సాధారణ ఎన్నికల్లో ఏర్పరిచిన వార్డు సరిహద్దులను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. ఈ ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాక ఎస్‌ఈసీ పోలింగ్‌ స్టేషన్ల గుర్తింపు, పబ్లికేషన్‌కు నోటిఫికేషన్‌ జారీ చేస్తుందన్నారు.  

రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత ఎస్‌ఈసీ ఎన్నికల నిర్వహణకు తేదీలను ఖరారు చేస్తుందని పార్థసారథి వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ పరిపాలన శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ డాక్టర్‌ శరత్, వివిధ జిల్లాల కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top