Hyderabad: ఆశలు ‘డబుల్‌’

Double Bedroom Houses Allotment For Beneficiaries In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ నగరంలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు దశలవారీగా అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం శుక్రవారం బన్సీలాల్‌పేట చాచానెహ్రూనగర్‌ (సీసీనగర్‌)లో 264 ఇళ్లను లబ్ధిదారులకు  అందజేయనుంది.

మురికివాడలు లేని విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పేదలు ఉంటున్న ప్రాంతాల్లోనే వారు నివసిస్తున్న ఇరుకు ఇళ్ల స్థానే కొత్తగా డబుల్‌ బెడ్రూం ఇళ్లతో పాటు ఏ ఆసరా లేని వారికి సైతం డబుల్‌ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో నిర్మాణం చేపట్టింది. 

లక్ష్యం 2 లక్షలు.. 
గ్రేటర్‌లో 2 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, తొలి దశలో లక్ష గృహాల నిర్మాణానికి అవసరమైన స్థలాలు సేకరించింది. వాటిల్లో  స్లమ్స్‌లోని పేదలు నివసిస్తున్న ఇరుకు ఇళ్లను కూల్చివేసి 40 ప్రాంతాల్లో 8,898 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మరో 71 ఖాళీ ప్రదేశాల్లో మిగతా 91,102 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు.

అన్నీ కలిపి మౌలిక సదుపాయాలతో సహా మొత్తం 4,038 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, 2,710 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. మిగతా 1,328 ఇళ్లను పంపిణీ చేయాల్సి ఉండగా, శుక్రవారం  సీసీనగర్‌లో 264  ఇళ్లను లబ్ధిదారులకు మంత్రులు కేటీఆర్, తలసాని పంపిణీ చేయనున్నా రు. సంబంధిత జిల్లా కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేశాక మిగతా వాటిని పంపిణీ చేయనున్నారు.

మౌలిక సదుపాయాల కోసం.. 
దాదాపు 70 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల పనులు జరగనందునే జాప్యం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. వాటిని పూర్తిచేస్తే లబ్ధిదారులకు పంపిణీ చేయవచ్చని 
పేర్కొన్నారు. 

నిధుల లేమి.. 
ప్రభుత్వం నుంచి  సకాలంలో   అందాల్సిన నిధులందకపోవడంతో పనులు కుంటుపడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించి రూ. 300 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దాంతో వారిని వేగిరపెట్టే పరిస్థితి లేదు.  

ఇళ్లు ఇలా.. 
విస్తీర్ణం: 560 చదరపు అడుగులు 
 2 బెడ్‌రూమ్స్, హాల్, కిచెన్, 2 టాయ్‌లెట్స్‌ 

ఖర్చు 
   డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ ప్రాజెక్ట్‌కు మంజూరైన నిధులు: రూ.8598.58 కోట్లు 
   పెరిగిన ధరలు, మౌలిక సదుపాయాలతో వెరసి అంచనా వ్యయం: రూ.9714.59 కోట్లు 
   ఇప్పటి వరకు చేసిన ఖర్చు దాదాపు: రూ.6,507 కోట్లు  
    పనుల పూర్తికి కావాల్సిన నిధులు: రూ.3,207 కోట్లు  

► గ్రేటర్‌ పరిధిలోని జిల్లాలు:  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి, సంగారెడ్డి 
► డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం అందిన దరఖాస్తులు: 6.50 లక్షలు. 
► ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (పీఎంఏవై) కింద మంజూరు చేసిన ఇళ్లు: 1,00,781 
► లక్ష ఇళ్లకు కేంద్రం ఇచ్చే సబ్సిడీ: రూ.1500 కోట్లు. 
► ఇప్పటి వరకు అందిన సబ్సిడీ: రూ.800 కోట్లు. 

కోవిడ్‌ దెబ్బ..  
వాస్తవానికి పనులు చేపట్టిన  అన్ని ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా, గత సంవత్సరం కోవిడ్‌ కారణంగా నిర్మాణ కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో పనులు కొంత మేర మందగించినప్పటికీ, తిరిగి జరుగుతున్నాయి. బండ మైసమ్మనగర్‌లో 310 ఇళ్లు కూడా ప్రారంభానికి సిద్ధం చేసినప్పటికీ, లబ్ధిదారుల అభీష్టం మేరకు వచ్చేనెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

– వెంకటదాస్‌రెడ్డి, హౌసింగ్‌ ఈఈ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top