Yadagirigutta: బస్సుల కొరత.. భక్తుల అవస్థ | Devotees problems At Sri Yadadri Lakshmi Narasimha Swamy Temple | Sakshi
Sakshi News home page

Yadagirigutta: బస్సుల కొరత.. భక్తుల అవస్థ

Jun 9 2025 8:53 AM | Updated on Jun 9 2025 8:53 AM

Devotees  problems At Sri Yadadri Lakshmi Narasimha Swamy Temple

 యాదగిరిగుట్టలో భక్తుల రద్దీకి 

అనుగుణంగా కనిపించని బస్సులు

గంటల పాటు నిరీక్షించిన భక్తులు 

క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల వద్ద కూడా సరైన ఏర్పాట్లు లేక ఇబ్బందులు

యాదగిరిగుట్ట: వేసవి సెలవులు ముగుస్తుండటంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు అధికంగా వస్తున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో గంటల తరబడి భక్తుల కొండ పైన, కొండ కింద బస్టాండ్‌లలో నిరీక్షించాల్సి వస్తోంది. ఆదివారం భక్తులు ఎక్కువగా రావడంతో చాలామంది కొండ కింద వాహనాలు పార్కింగ్‌ చేసి ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి వెళ్లాల్సి వచ్చింది. సరిపడా బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

కేవలం తొమ్మిది బస్సులే..
యాదగిరిగుట్ట పైకి, కొండ కిందకు ఆదివారం 9 బస్సులను మాత్రమే అధికారులు నడిపించారు. ఒక్కో బస్సులో 60 మంది ప్రయాణికులు ఎక్కాల్సి ఉండగా.. 100 మంది వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మంది భక్తులు సీట్ల కోసం పోటీపడడంతో పాటు ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది. సరిపడా బస్సులు లేకపోవడంతో అధికారుల తీరుపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. చాలామంది భక్తులు మెట్ల మార్గంలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 

చిన్న పిల్లలు, తల్లుల ఇబ్బందులు..
ధర్మ దర్శనం, వీఐపీ దర్శనం క్యూలైన్లలో చిన్న పిల్లలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. క్యూలైన్లలో ఉక్కపోతతో పాటు క్యూకాంప్లెక్స్‌ నుంచి గోల్డ్‌ క్యూలైన్‌లోకి వచ్చే వరకు నీళ్లు లేకపోవడంతో చిన్నారులు తీవ్రంగా ఏడ్చారు. ఆలయాధికారులు రూ.150 క్యూలైన్, గోల్డ్‌ క్యూలైన్‌లోని భక్తులకు మాత్రమే తాగునీటిని సరఫరా చేశారు. పలువురు భక్తులు తమ పిల్లలతో నేరుగా తూర్పు రాజగోపురం ముందు ఉన్న మెయిన్‌ గేట్‌ ద్వారా ఆలయంలోకి వెళ్లేందుకు గాను ఎస్‌పీఎఫ్, హోంగార్డు సిబ్బందిని వేడుకున్నా తాళాలు తీయలేదు. ఆలయ అధికారులు వచ్చి జోక్యం చేసుకోవడంతో తాళాలు తీసి పంపించారు. చిన్నారులతో వచ్చిన పలువురు భక్తులు తూర్పు రాజగోపురం ముందు నుంచి, వైకుంఠద్వారం వద్ద స్వామిని మొక్కి దర్శనం చేసుకోకుండానే వెనక్కి వెళ్లిపోయారు.

ప్రసాద విక్రయశాలలోనూ అవస్థలే..
ప్రసాదం కౌంటర్‌ శివాలయం ముందు ఉండటంతో అక్కడికి మెట్లు దిగి వెళ్లి, టిక్కెట్‌ కొనుగోలు చేసి తిరిగి ప్రసాద విక్రయశాలలో గంటల తరబడి ప్రసాదం కోసం వేచి చూడాల్సి వచ్చిందని భక్తులు తెలిపారు. ప్రసాద విక్రయశాల పక్కకే కౌంటర్‌ పెట్టి ఉంటే బాగుండేదని పలువురు భక్తులు పేర్కొన్నారు. గంటల తరబడి దర్శనం క్యూలైన్లలో నిల్చోని, ప్రసాదం కోసం కూడా వేచి ఉన్నామని మహిళా భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

బస్సులు సరిగ్గా లేవు
యాదగిరీశుడిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో వచ్చాను. కొండ కింద నుంచి ఆర్టీసీ బస్సులో కొండపైకి వచ్చాం. సుమారు నాలుగు గంటలు ధర్మ దర్శనం క్యూలైన్‌లో నిల్చోని స్వామిని దర్శించుకున్నాం. మధ్యాహ్నం 12గంటల తర్వాత కొండ పైన బస్టాండ్‌ వద్దకు వచ్చేసరికి బస్సులు లేవు. ఒకేసారి 4 బస్సులు వచ్చినప్పటికి భక్తులంతా గుంపులుగా వెళ్లి పోటీపడుతూ ఎక్కారు. సుమారు 45 నిమిషాల పాటు మరో బస్సు కోసం వేచి చూడాల్సి వచ్చింది. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించాలి. 
– శ్రీనివాస్, పాల్వంచ

ప్రసాదం కోసం వేచి చూశాం
కుటుంబ సభ్యులతో కలిసి రూ.150 టిక్కెట్‌ కొనుగోలు చేసి స్వామిని దర్శించుకున్నాం. అనంతరం లడ్డూ, పులిహోర ప్రసాదం కొనుగోలు కోసం వెళ్తే భారీ లైన్‌ ఉంది. వృద్ధులు, దివ్యాంగులకు ప్రసాదం సెక్షన్‌ వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాం. అధికారులు ప్రసాద విక్రయశాల వద్ద దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.
– విజయలక్ష్మి, సిద్దిపేట 

Advertisement
 
Advertisement
Advertisement