
సాక్షి, యాదాద్రి : వేసవి కాలం భానుడి భగభగలు ప్రారంభంతోనే యాదాద్రికొండపైకి వచ్చిన భక్తులు ఉరుకులు పరుగులు పెట్టక తప్పడంలేదు. దేవస్థానానికివస్తున్న వేలాది మంది భక్తులు ఎండకు తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. రాతికొండపై కృష్ణ శిలలతో నిర్మించిన నూతన దేవాలయం ప్రాంగంణం అంతా భగభగమండిపోతోంది.
ఉదయం 11 గంటల నుంచే ఫ్లోరింగ్ బండల నుంచి వేడి సెగలు భక్తులను పరుగులు పెట్టిస్తున్నాయి. రూ.150 టికెట్‌తో శీఘ్ర దర్శనం కోసం క్యూలో ఉన్న భక్తులకు నిలువ నీడ లేకుండాపోయింది. ఆలయంలో శ్రీ స్వామి దర్శం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన ఫ్లోరింగ్ బండలపై నడిచే భక్తుల కాళ్లు కాలుతున్నాయి. వృద్ధులు వేగంగా నడవలేక అరికాళ్లు కమిలిపోతున్నాయి. దూరంగా ఉన్న ప్రసాదాల విక్రయం వద్దగల నీడ కోసం పరుగులు తీస్తున్నారు. కొండపైన విశాలమైన స్థలం ఉన్నా కనీసం చలువ పందిళ్లు వేయకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.