ప్రియుడి వేధింపులు తాళలేక.. బలవన్మరణం
హైదరాబాద్: ప్రియుడు నిత్యం వేధిస్తుండటంతో ఓ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన మేరకు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మొల్లి దుర్గ(23) నానక్‌రాంగూడలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో టెలీకాలర్‌గా పని చేస్తోంది. షాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన సాయి కుమార్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. నెల రోజులనుంచి ఇద్దరూ కేశవ్‌నగర్‌లో ఉంటున్నారు. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న సాయి కుమార్ కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు.
శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగుతూ సాయికుమార్ గొడవకు దిగాడు. తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గ ఐదో అంతస్తుపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు సిటిజన్ హస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దుర్గ తల్లి దుబాయ్‌కి వెళ్లింది. మేనమామ దేవరంపల్లి రవి కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సాయి కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.


