రిమ్స్‌లోని ఎస్‌ఎన్‌సీయూ విభాగాన్ని సీజ్ చేస్తున్న రెవెన్యూ అధికారులు
రిమ్స్ ఘటనలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య
సాక్షి, హైదరాబాద్/సాక్షి, ఆదిలాబాద్ /ఆదిలాబాద్‌టౌన్/కైలాస్‌నగర్: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఏసీ పేలిన ఘటనలో మరో ఇద్దరు శిశువులు మృత్యువాత పడ్డారు. దీంతో మృత్యుల సంఖ్య ఐదుకు చేరింది. మరో నలుగురు పసికందుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బజార్‌హత్నూర్ మండలం అనంతపూర్ గ్రామానికి చెందిన నాగుబాయి–ఇస్రు దంపతుల చిన్నారి రిమ్స్‌లో, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కుచులాపూర్ గ్రామపంచాయతీ పరిధి మల్లెగూడకు చెందిన దుర్గాబాయి–మారుతి దంపతుల శిశువు హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందింది. మొత్తం 27 మంది చిన్నారులు వార్డులో చికిత్స పొందుతుండగా, 15 మందిని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
మిగతా చిన్నారులు రిమ్స్‌లో తల్లుల వద్ద ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు రిమ్స్ ఘటనపై విచారణ మొదలైంది. ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరందు చైర్మన్‌గా, ఆరుగురు అధికారులతో ఉన్నతస్థాయి విచారణ కమిటీని కలెక్టర్ రాజర్షిషా ఏర్పాటు చేశారు. ఇందులో ఏజెన్సీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుభాష్ జాదవ్, డీఈ, టీఎస్‌ఎంఐడీసీ ఈఈ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులను నియమించారు. విద్యుత్ వైరింగ్ వ్యవస్థ, ఫైర్ సేఫ్టీ నిబంధనలు వంటి అంశాలపై కమిటీ నిశితంగా పరిశీలించి, నివేదిక రూపొందించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎన్‌సీయూ విభాగాన్ని అధికారులు సీజ్ చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
అగి్నప్రమాదంలో మృతిచెందిన చిన్నారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేíÙయా ప్రకటించింది. ఐదుగురు శిశువుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ కింద ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ పరిహారం అందించనున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రూ.లక్ష చొప్పున బీఆర్‌ఎస్ ఆర్థిక సాయం
ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యేలు కోవాలక్షి్మ, అనిల్‌జాదవ్ మాజీ మంత్రులు జోగు రామన్న, సత్యవతి రాథోడ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్ నాయక్ తదితరులు పరిశీలించారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేర కు బాధిత కుటుంబాలకు బీఆర్‌ఎస్ పార్టీ తరఫున రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు ప్రకటించారు.
నివేదిక కోరిన మానవ హక్కుల కమిషన్
నవజాత శిశువులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్పందించింది. పలు పత్రికల్లో ప్రచురితమైన వార్తలను ఆధారంగా చేసుకొని కమిషన్ ఈ ఘటనను స్వీకరించింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 27 వరకు వాయిదా వేసింది.
ఎందుకీ ఏసీలు?
రిమ్స్‌ఎస్‌ఎన్‌సీయూ విభాగంలో అలంకారప్రాయంగా మారిన ఏసీల పేలుడుతో ఐదుగురు శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎంఐసీయూ, కిడ్నీ విభాగంలో ఉన్న ఏసీలు కూడా పనిచేయలేదు. వాటికి మరమ్మతులు చేయకపోగా, విద్యుత్ సరఫరాను నిరంతరం కొనసాగిస్తున్నారు. దీంతో ఈ వార్డుల్లోనూ ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

రిమ్స్‌లో చిన్నారుల మరణాలు ప్రభుత్వ హత్యలే: కవిత
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్‌లో చిన్నారుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని టీఆర్‌ఎస్ చీఫ్ కవిత విమర్శించారు. దత్తత తీసుకున్న జిల్లాలో చిన్నారులు చనిపోతే ముఖ్యమంత్రికి వచ్చే తీరిక లేదా అని ప్రశ్నించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన కవిత రిమ్స్‌లో సంఘటన జరిగిన ఎస్‌ఎన్‌సీయూ వార్డును సందర్శించారు. పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఇంద్రవెల్లి మండలం గిన్నెరలో బా«ధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రిమ్స్ అగ్ని ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు ఆస్పత్రి డైరెక్టర్ నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. మృతిచెందిన చిన్నారుల కుటుంబ సభ్యులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.


