అపోహలొద్దు.. అందరికీ దళితబంధు 

Dalit Bandhu To Be Extended To Every Dalit Family: Harish Rao - Sakshi

మంత్రి హరీశ్‌రావు స్పష్టీకరణ 

హుజూరాబాద్‌లో 20 వేల కుటుంబాలకు లబ్ధి 

రైతుబంధు సమయంలో కూడా తప్పుడు ప్రచారం 

అప్పుడు చప్పట్లు కొట్టిన కొందరు ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నారు 

హుజూరాబాద్‌ /సాక్షి, కరీంనగర్‌: అర్హులైన వారందరికీ దళితబంధు అందజేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ పథకంపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని కోరారు. శనివారం హుజూరాబాద్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి హరీశ్‌ మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద ఈనెల 16న హుజూరాబాద్‌ మండలంలోని శాలపల్లిలో సీఎం ప్రారంభించనున్నట్లు చెప్పారు.

హుజూరాబాద్‌లోని ప్రతి దళిత కుటుంబానికీ ఈ పథకాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. దళిత బంధును ఇక్కడ అమలు చేయడానికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నిధులతో 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతు బంధు ఇక్కడినుంచి ప్రారంభించినప్పుడు కూడా.. కొందరికే వస్తుందని, ఎన్నికల కోసమే ఇస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. రైతు బంధు ఇదే నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన కొందరు నాయకులు, ఇవాళ దళిత బంధు ప్రారంభిస్తుంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. ఎన్నికల కోసం ఈ పథకం తెచ్చారంటున్నారని, కానీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగానే ఈ పథకం గురించి చెప్పామని హరీశ్‌ గుర్తుచేశారు. మార్చిలోనే ఈ కొత్త పథకాన్ని సీఎం ప్రకటించారని చెప్పారు.  

కేంద్రం రూ.40 లక్షలు ఇస్తే సంతోషిస్తాం 
‘ఎంపీ బండి సంజయ్‌ రూ.50 లక్షలు ఇవ్వాలంటున్నారు. మాకు చేతనైనంత మట్టుకు రూ.10 లక్షలు ఇస్తున్నాం. మరో రూ.40 లక్షలు అదనంగా కేంద్రం నుండి తెచ్చిస్తే మీకు, మోదీకి ప్రజలు పాలాభిషేకం చేస్తారు. మొత్తంగా ప్రజలకు రూ.50 లక్షలు అందితే మేమెంతో సంతోషిస్తాం..’అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.  

సీఎం చేతుల మీదుగా 15 కుటుంబాలకు చెక్కులు 
16న జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి 15 కుటుంబాలకు చెక్కులు అందజేస్తారని మంత్రి తెలిపారు. 16న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం శాలపల్లికి వస్తారని, 4 గంటల వరకు సభ ఉంటుందని చెప్పారు. గ్రామసభలు నిర్వహించి.. సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల సమక్షంలో ప్రజల మధ్యే అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మేయర్‌ సునీల్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

అత్యంత బీదలు తొలి లబ్ధిదారులు: సీఎస్‌ 
దళితబంధు అమలుపై శనివారం కలెక్టరేట్‌లో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, సీఎస్‌ సోమేశ్‌కుమార్, ఎస్సీ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, కలెక్టర్‌ కర్ణన్‌ తదితరులు సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎస్‌ విలేకరులతో మాట్లాడారు. అత్యంత బీదలైన దళితులను దళిత బంధు తొలి లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని చెప్పారు. అత్యంత పేదరికంలో ఉన్నవారితో మొదలుపెట్టి, అర్హులైన అందరికీ అందేలా చర్యలు చేపడతామన్నారు.  

సీఎం సభకు ఏర్పాట్ల పరిశీలన 
శాలపల్లిలో సీఎం సభ ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌ శనివారం పరిశీలించారు. ఐజీ నాగిరెడ్డి, సీపీ సత్యనారాయణకు పలు సూచనలు చేశారు. ఈ సభకు లక్షా 20 వేల మంది హాజరుకానున్నారు. సభకు దళితులను తీసుకురావడానికి 825 బస్సులను ఏర్పాటు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top