వాట్సాప్‌.. నిఘా హ్యాండ్సప్‌!

Criticisms on intelligence system failed Agnipath Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ రంగంలో అయినా, నేర సామ్రాజ్యంలో అయినా, సామాజిక అంశాల్లో అయినా చీమ చిటుక్కుమన్నా ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాలి. కానీ, ఇప్పుడు ఆ వ్యవస్థ నిద్రమత్తులో జోగుతోందన్న విమర్శలు వెల్లువెత్తు న్నాయి. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో జరిగిన ఆందోళనలు, విధ్వంసాలను పసిగట్టడంలో రాష్ట్ర, కేంద్ర ఇంటెలిజెన్స్‌ వ్యవస్థల వైఫల్యం కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పలు వరుస ఘటనలపై ముందే సమాచారాన్ని సేకరించడంలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ విఫలమైనట్టు విమర్శలు వినవస్తున్నాయి. 

కాంగ్రెస్‌ చలో రాజ్‌భవన్‌లో... 
రాహుల్‌గాంధీకి ఈడీ నోటీసులిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్‌ ఎంపీలపై, ఏఐసీసీ కార్యాలయంపై పోలీసులు జరిపిన దాడికి నిరసనగా టీపీసీసీ చలో రాజ్‌భవన్‌ చేపట్టింది. ఈ ఆందోళన విధ్వంసానికి దారితీసింది. కాంగ్రెస్‌ గతంలో గల్లీలో ధర్నా చేసేందుకు యత్నించినా, ఆందోళనలకు పిలుపునిచ్చినా పోలీసులు ప్రతీ నాయకుడిని ముందస్తుగానే హౌస్‌అరెస్ట్‌తోపాటు అదుపులోకి తీసుకునేది. కానీ, చలో రాజ్‌భవన్‌ ముట్టడిలో ఎందుకు అప్రమత్తత కాలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి.

ఇంటెలిజెన్స్‌ చెప్పినా సిటీ పోలీసులు పట్టించుకోలేదా లేదంటే ఇంటెలిజెన్స్, హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ వ్యవస్థ అప్రమత్తత చేయలేదా అన్నదానిపై అనుమానాలు కలుగుతున్నాయి. అవి ఎందుకు ఇంతటి మొద్దునిద్రలో ఉందని బీజేపీ నేతలు ఒకవైపు ఆరోపిస్తున్నా ఇప్పటి వరకు అధికార వ్యవస్థ ఖండించకపోవడం లేదా స్పష్టత ఇవ్వకపోవ డంపై  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

వాటిని పట్టించుకోలేదు 
కేంద్రం అగ్నిపథ్‌ను ప్రకటించిన నాటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఉద్యోగార్థులు దీన్ని వ్యతిరేకిస్తూ గళమెత్తారు. కొన్నేళ్లుగా ఆర్మీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు.. దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే రైల్వేస్టేషన్ల వద్ద నిరసనలు, విధ్వంసాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అయినా రాష్ట్ర పరిస్థితులను నిఘావర్గాలు గుర్తించాలి. రైల్వేస్టేషన్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా అప్రమత్తం చేయాలి. నిఘావ్యవస్థ నిద్రావస్థకు చేరుకోవడంతోనే ఉద్యోగార్థులు ఆందోళన చేయనున్నారనే విషయం పసిగట్టలేకపోయింది. 

ఇంటెలిజెన్స్‌ వర్గాల కళ్లలో పడని సందేశాలు 
ఆర్మీ ఉద్యోగార్థులు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్‌ గ్రూపుల ద్వారానే శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వే జంక్షన్‌ వద్ద నిరసన చేపట్టాలనే సందేశం సర్క్యులేట్‌ అ యింది. 8 వాట్సాప్‌ గ్రూపుల్లో మొదలైన ఈ సందేశం వేలమందికి చేరింది. అయినప్పటికీ నిఘా వర్గాల సాంకేతికత, ఇంటెలిజెన్స్‌ కళ్లలో పడకపోవడం గమనార్హం. సికింద్రాబాద్‌ స్టేషన్‌ వద్ద నిరసన తెలపడానికి తెలుగు రాష్ట్రాలకు  చెందినవారూ అనేక మంది గురువారమే హైదరాబాద్‌ చేరుకున్నారు.

పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులమంటూ రైల్వే స్టేషన్‌ చుట్టుపక్కల, ఇతర ప్రాంతాల్లో ఉన్న లాడ్జిల్లో బస చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర, నగర నిఘా వర్గాలు గుర్తించలేదు. వరంగల్, ఆదిలాబాద్‌ వైపు నుంచి వచ్చే రైళ్లల్లో ఉదయం అనేకమంది ఆందోళనకారులు నగరానికి వచ్చారు. ఈ అంశమూ నిఘావర్గాలు పసిగట్టలేకపోయాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top