కాంగ్రెస్ వైపు కామ‍్రేడ్లు.. బీఆర్‌ఎస్‌ నాయకుల తీరుపై అసహనం

Cpm and Cpi Parties Ready To alliance with Congress - Sakshi

అసెంబ్లీ ఎన్నిక లకు ఏడాది సమయం కూడా లేదు. ముందస్తు ఎన్నికలపైనా ఊహాగా నాలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ఎన్నికలు లక్ష్యంగానే వ్యూహాలు రూపొందించి అమ లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తులు తెరపైకి వస్తుండగా.. వామ పక్షాలు తాజాగా కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలనే ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికలో లెఫ్ట్‌ పార్టీలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించాయి. ప్రచారం సైతం నిర్వ హించాయి.

భవిష్యత్తులోనూ సీపీఎం, సీపీఐ తో కలిసే వెళ్తామని ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పారు. సీఎం కేసీఆర్‌ కూడా కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిన్న, మొన్నటివరకు ఇదే విధమైన వాతావరణం కన్పించింది. కానీ వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, కేవలం అవగాహన మాత్రమే ఉంటుందని ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ స్పష్టం చేయడం, బీఆర్‌ఎస్‌ అధిష్టానం దీనిపై మౌనం వహించడం ఉభయ కమ్యూనిస్టు పార్టీలను అయోమయంలో పడేసింది. ఈ నేపథ్యంలోనే.. బీఆర్‌ఎస్‌ కలిసిరాని పక్షంలో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. 

బీజేపీ ఓటమే లక్ష్యం..
దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా లెఫ్ట్‌ పార్టీలు పనిచేస్తున్నాయి. బీజేపీతో విభేదించే పార్టీలు ఏవైనా సరే వాటితో కలిసి ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల్లో పొత్తులు కూడా పెట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీపీఐ, సీపీఎం పార్టీలు బీఆర్‌ఎస్‌తో జత కట్టాయి. ఆ పార్టీ విజయంలో తమ వంతుపాత్ర పోషించాయి. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నేపథ్యంలో ఇటీవల ఖమ్మంలో ఆ పార్టీ నిర్వహించిన సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం పాల్గొని ఐక్యత చాటారు.

కానీ ఇటీవల కాలంలో వామపక్షాలతో పొత్తుపై బీఆర్‌ఎస్‌ నాయకులు స్వరం మార్చారు. అసెంబ్లీ స్థానాలు ఇచ్చేది లేదని, అవసరమైతే పెద్దల సభకు నామినేట్‌ చేస్తామంటూ తలోమాట మాట్లాడుతుండటంతో లెఫ్ట్‌ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీపీఐ, సీపీఎంలు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాయని, ఇదే అదనుగా కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దిగిందని, ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు కొందరు లెఫ్ట్‌ పార్టీల నేతలతో మంతనాలు జరిపారని తెలిసింది. అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ పెద్దలు.. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే అధికారం ఖాయం. కాబట్టి మీరు మా వైపు రండి..’ అంటూ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు ఎన్నికలకు సంబంధించి మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.  

కమ్యూనిస్టుల ముందు 3 ప్లాన్‌లు...

లెఫ్ట్‌ పార్టీలు ప్లాన్‌ ఏ, ప్లాన్‌ బీ, ప్లాన్‌ సీ.. ఇలా మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
 ప్లాన్‌ ఏ.. 
బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండేలా కృషి చేయడం. చెరో పది సీట్లు అడగాలి. మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ, నకిరేకల్, పాలేరు, వైరా, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, ఇబ్రహీంపట్నం, హుస్నాబాద్‌ స్థానాల కోసం పట్టుబట్టాలి. ఒకవేళ కొన్ని కాదని ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామంటే ఆలోచించాలి. 

ప్లాన్‌ బీ.. 
బీఆర్‌ఎస్‌ తర్వాత బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్, వైఎస్సార్‌టీపీ, తెలంగాణ జన సమితి వంటి పార్టీలతో జత కట్టడం. కాంగ్రెస్‌ పార్టీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి సాను కూలంగా ఉండటం కీలకాంశం.

ప్లాన్ సీ

 కాంగ్రెస్‌ గౌరవప్రదమైన సీట్లకు అంగీకరించని పక్షంలో, ఏదైనా కారణంతో ఆ పార్టీతోనూ పొత్తు కుదరని పక్షంలో ఒంటరి పోరాటం చేయడం. చెరో 25 స్థానాల్లో పోటీ చేసి ఎన్నికల పోరాటంలో బీజేపీ సహా ఇతర పార్టీల వైఖరులను, విధానాలను ఎండగట్టడం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top