మాస్కులతో తప్పనిసరి.. మంచీ చెడులు తెలుసుకోండి!

Covid Time Face Masks For Expressions - Sakshi

హావభావాలకు మాస్క్‌

మనసు పలకదు.. ముఖం చెప్పదు..

మనుషుల భావోద్వేగాలను మూసేస్తున్న మాసు్కలు 

జీవనశైలిలో అనూహ్య మార్పులు తెచ్చిన కోవిడ్‌ నిబంధనలు 

మానవ సంబంధాల్లోనూ మార్పులు వచ్చాయంటున్న నిపుణులు 

సాక్షి, హైదరాబాద్‌: ‘మబ్బులో ఏముందీ.. నా మనసులో ఏముందీ..’అంటూ ప్రియురాలి మనస్సును ఆవిష్కరిస్తాడు సినీ కవి. మనసులోని భావాలను, భావోద్వేగాలను ప్రతిబింబించేది ముఖమే. ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు ముఖంలో కనిపించే హావభావాలే వారి ఆలోచనలను బయటపెడతాయి. కోపం, బాధ, సంతోషం వంటి మానసిక స్థితి తెలిసిపోతుంది. కానీ కరోనా కారణంగా ఏడాదిన్నర కాలంగా అలవాటైన మాస్కులు ఈ భావోద్వేగాలకు ముసుగేసేశాయి.

ఎవరు ఎవరితో మాట్లాడినా వారి భావోద్వేగాలేమిటో తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. కొందరైతే మాస్కు మాటున తమ మనసులోని భావాలను దాచేస్తున్నారని, మాస్కు లేకుండా మాట్లాడలేని స్థితికి చేరుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా కోవిడ్‌ నియంత్రణ కోసం అమలు చేసిన నిబంధనలు జీవనశైలిలో అనూహ్య మార్పులు తెచ్చాయని అంటున్నారు. ‘‘గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 50 శాతానికి పైగా జనంలో మాస్కు వల్ల కొత్త మార్పులు కనిపిస్తున్నాయి’’అని ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు కల్యాణ్‌ చక్రవర్తి తెలిపారు. 

మనసుకు ముసుగు 
► ముఖం, కళ్లు మనిషి మనసులోని భావాలను ప్రతిబింబిస్తాయి. కానీ ఏడాదిన్నరగా మాస్కులు పెట్టుకొనే ఉంటుండటంతో ఎదుటివారి భావాన్ని తెలుసుకోలేని పరిస్థితి ఉంది. మాటల్లోని పదాల కంటే ముఖంలో కనబడే భావాలే.. ఆ మాటల అసలు ఉద్దేశాన్ని తెలుపుతాయి. కానీ మాస్కుల వల్ల ఏ భావంతో ఏ మాట్లాడుతున్నారో ఎదుటివాళ్లు పసిగట్టలేకపోతున్నారు. మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. ‘మాట వినిపిస్తుంది. కానీ మనసు కనిపించదు.. ఇది చాలా పెద్ద సమస్య’’అని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ సంహిత తెలిపారు. 

► సిగ్గు, బిడియం, ఆత్మన్యూనతా భావం వంటి సమస్యలున్న వారు మాత్రం మాస్కులో స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారని.. అలాంటి వారు మాస్కు లేకుండా మాట్లాడేందుకు వెనకడుగు వేస్తున్నారని సంహిత తెలిపారు. మొదట వైరస్‌ రక్షణ కోసమని మొదలుపెట్టిన మాస్కు ఇప్పుడు జీవితంలో భాగమైందని.. 60 శాతానికిపైగా జనం మాస్కు మాటున మాట్లాడుకోవడం అలవాటుగా మార్చుకున్నారని చెప్పారు. 

► నలుగురు కలిసి పనిచేసే చోట మాస్కులు ధరించడం తప్పనిసరైంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో, కార్పొరేట్‌ సంస్థల్లో సిబ్బంది మధ్య మాసు్కలు దూరాన్ని పెంచుతున్నాయని డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి చెప్పారు. ఆ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. 

► స్కూళ్లు, విద్యా సంస్థలు తిరిగి తెరుచుకున్నాయి. పిల్లలు, టీచర్లు మాసు్కలు ధరించి హాజరవుతున్నారు. ఈ క్రమంలో తాము చెప్పే పాఠాలను పిల్లలు ఏ మేరకు గ్రహించగలుగుతున్నారు. వారి మానసిక స్థితి ఎలా ఉందన్నది తెలుసుకోవడం టీచర్లకు కష్టంగా మారింది. అదే సమయంలో టీచర్ల హావభావాలను పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు.  
(చదవండి: వృథా అయిన డోసులు 23 లక్షలు, ఇలా అయితే బెటర్‌!)

ఆరోగ్యానికి మాస్కు మంచిదే.. 
మాస్కులు పెట్టుకునే అలవాటు వల్ల ఆరోగ్యం విషయంగా చాలా మంచి మార్పులు వచ్చాయి. ఒక్క కరోనా అనే కాకుండా చాలా రకాల వైరస్‌ల నుంచీ జనానికి రక్షణ సమకూరుతోంది. అయితే ఎక్కువ సమయం మాస్కులో గడపడం వల్ల ఊపిరి తీసు కోవడంలో ఇబ్బందులు, నోటి దుర్వాసన వంటి పలు ఇతర సమస్యలు తలెత్తుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కానీ మాస్కుల వల్ల గాలి కాలుష్యం నుంచి, దుమ్ము, ధూళి ఊపిరితిత్తుల్లోకి పోకుండా రక్షణ పొందుతున్నారు. అంటువ్యాధుల బారిన పడకుం డా రక్షణ కలుగుతోంది. ఆస్తమా కేసులుకూడా తగ్గు ముఖం పట్టినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. 

మాస్కు తీయలేకపోతున్నారు 
‘‘మాస్కు తీసి మాట్లాడాలంటే కొందరు ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది మాటలను, భావాలను విశ్లేషించడం కష్టంగా మారుతుంది. దీనివల్ల బంధాలు పలుచనవుతున్నట్లు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపైన మరింత విస్తృతంగా అధ్యయనం జరగాల్సి ఉంది’’     
–డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top