వృథా అయిన డోసులు 23 లక్షలు, ఇలా అయితే బెటర్‌!

Covid Vaccination In India Over 23 Lakh Doses Wasted Tips To Reduce It - Sakshi

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా నడుస్తోంది. అదే సమయంలో వ్యాక్సిన్‌ వేస్ట్‌ అవుతుందన్న చర్చా నడుస్తోంది.. కేంద్రం లెక్కల ప్రకారం.. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా కరోనా డోసులు సరఫరా చేయగా.. అందులో 3.5 కోట్ల డోసులు జనానికి ఇచ్చారు. 23 లక్షల డోసులు వృథా అయ్యాయి.  మొత్తం డోసుల్లో 6.5 శాతం డోసులు వృథా అయినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్రం, ఆయా రాష్ట్రాల లెక్కలు ఎలా ఉన్నా.. కోవిడ్‌ వ్యాక్సిన్‌ అన్నది చాలా ప్రాముఖ్యత కలిగిన నేపథ్యంలో అసలు ఇది వృథా ఎలా అవుతోంది? దీన్ని నివారించడంపై  నిపుణులు ఏం చెబుతున్నారు? అన్న వివరాలను ఓసారి తెలుసుకుందామా..

ఇలా వృథా
ప్రతి కోవిషీల్డ్‌ బాటిల్‌ (వయల్‌)లో 10 డోసులు (ప్రతి వ్యక్తికి 0.5 ఎంఎల్‌), కోవాగ్జిన్‌లో 20 డోసుల టీకా మందు ఉంటుంది. ఒక్కసారి బాటిల్‌ తెరిస్తే.. నాలుగు గంటల సమయంలో అన్ని డోసులను వేసేయాల్సి ఉంటుంది. లేదంటే.. మిగిలినది వృథా అయినట్లే.. 60 ఏళ్లు దాటినవారు.. లేదా 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మన దేశంలో వ్యాక్సినేషన్‌కు అర్హులు.

అయితే.. ఈ లబ్ధిదారుల్లోనూ తక్కువ మందే టీకా వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇదే వృథాకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘ఉదాహరణకు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఇద్దరు వ్యక్తులు వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి వచ్చారు. వారికి టీకా వేయడానికి నేను కోవిషీల్డ్‌ బాటిల్‌ తెరిచాను. తర్వాత.. నాలుగు గంటల వ్యవధిలో మరో ఆరుగురే వచ్చారనుకోండి.. అప్పుడు మిగిలిన రెండు డోసులు వృథా అయినట్లే. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడటానికి లేదు’’ అని ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి  వైద్యుడు సురేశ్‌ కుమార్‌ తెలిపారు.

ఢిల్లీలో 24 గంటలూ వ్యాక్సినేషన్‌ జరుగుతున్న ఏకైక ప్రభుత్వ ఆస్పత్రి ఇది. దీన్ని నివారించడానికి సింగిల్‌ డోస్‌ వయల్స్‌పై దృష్టి పెడితేనో అని ప్రశ్నిస్తే.. ‘‘వాటి వల్ల ప్యాకేజింగ్, రవాణా సమస్యలతోపాటు ఖర్చుపరంగా చూసుకున్నా.. పెద్దగా వర్కవుట్‌ కాదు’’ అని ఆయన చెప్పారు. ప్రస్తుత వ్యాక్సిన్‌లు ఎక్కువ మందికి వేయడానికి ఉద్దేశించినవని.. అందుకే ఎంత ఎక్కువ మంది టీకాలు వేయించుకుంటే.. అంత వృథా తగ్గుతుందని అన్నారు.
(చదవండి: మాస్కులతో తప్పనిసరి.. మంచీ చెడులు తెలుసుకోండి!)

ఇలా చేస్తే..
వృథాను నివారించడానికి కొన్ని నిబంధనలను మార్చాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘వ్యాక్సినేషన్‌ సెంటర్ల చుట్టుపక్కల కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రజలందరి డాటాను సంబంధిత కేంద్రాలకు ఇవ్వాలి. టీకా వృథా కాకుండా ఉండాలంటే ఈ బ్యాకప్‌ డాటా అన్నది చాలా ముఖ్యం. 60 ఏళ్లు, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అని కాకుండా.. అందరి వివరాలు ఇవ్వాలి.  

దీని వల్ల సంబంధిత కేంద్రం నుంచి ఫోన్‌ చేసి.. టీకా వేయించుకొమ్మని చెప్పడానికి వీలవుతుంది. ఎవరు వస్తే వారు.. ఓ 30 ఏళ్ల వ్యక్తి వచ్చినా వారికి వ్యాక్సిన్‌ వేసేయాలి. ఎందుకంటే.. టీకాను అలా వృథాగా పడేసే బదులు.. ఎవరో ఒకరికి ఇవ్వడం బెస్ట్‌ కదా’ అని ప్రజారోగ్య నిపుణుడు దిలీప్‌ మవలంకర్‌ చెప్పారు. దేశంలోని 50 జిల్లాల్లో కోవిడ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయని.. అలాంటివాటిల్లో అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా వైరస్‌ను నియంత్రించవచ్చని తెలిపారు.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై నిబంధనలను సడ లించాలని.. మరింత మందిని ఆ జాబితాలోకి చేర్చ డం ద్వారా వ్యాక్సిన్‌ వృథాను అరికట్టవచ్చని మరి కొందరు నిపుణులు చెబుతున్నారు. ఫలానావారికే అని పరిమితం కాకుండా.. మరింత మందిని అర్హత జాబితాలో చేరిస్తే.. టీకా వృథాకు చాలా తక్కువ అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు.
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top