సెకండ్‌ వేవ్‌: స్వీయ నిర్బంధమే... శ్రీరామరక్ష

Covid Second Wave  Spreading Faster In India - Sakshi

బయట తిరుగుతున్న పాజిటివ్‌ వ్యక్తులు

వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్న వైనం

కోవిడ్‌ పరీక్షలకు ముందుకు రాని ప్రజానీకం

సాక్షి, నేరడిగొండ(ఆదిలాబాద్‌): జిల్లాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. పల్లె, పట్టణమనే తేడా లేకుండా వైరస్‌ విజృంభిస్తోంది. వ్యాధి బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. మరణాల రేటు సైతం పెరుగుతోంది. కనీస జాగ్రత్తలు ప్రజలు పాటించకపోవడంతోనే దీనికి కారణమని క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. కోవిడ్‌ బారిన పడకుండా కనీస నిబంధనలు పాటించకపోవడం, లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోకపోవడం, కోవిడ్‌ నిర్ధారణ అయినా స్వీయ నిర్బంధ నియమాలను నిర్లక్ష్యం చేయడం కోవిడ్‌ కేసులు పెరగడానికి కారణమవుతోంది.

పరీక్షలకు మొగ్గుచూపని ప్రజానీకం...
జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పుల్లాంటి లక్షణాలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వాసన తెలియకపోవడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం లాంటి తీవ్ర లక్షణాలు కనిపించినప్పుడే కోవిడ్‌గా అనుమానించి పరీక్షలకు వెళ్తున్నారు. సాధారణ లక్షణాలు ఉన్నవారు, ఎలాంటి లక్షణాలు లేని వారిలోనూ ప్రస్తుతం కోవిడ్‌ నిర్ధారణ అవుతోంది. అనుమానం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకోనివారు, వైరస్‌ వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారణ అయితే రెండు వారాల పాటు ఎక్కడికీ వెళ్లే అవకాశం ఉండదని, ఉపాధి పోతుందని, ఎవరూ దగ్గరకు రారని, ఇతర వ్యక్తిగత కారణాలతో చాలా మంది పరీక్షలకు ముందుకు రావడం లేదు.

బయటకు వస్తున్న పాజిటివ్‌ వ్యక్తులు...
లక్షణాలు ఉన్నవారు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులకు పరీక్షల కోసం వెళ్తున్నారు. కోవిడ్‌ ఉందని నిర్ధారణ అయితే అక్కడే వైద్యులు అందించే ఐసోలేషన్‌ కిట్‌ను తీసుకుని బస్సుల్లోనో.. ఆటోల్లో ఇంటికి వెళ్లి స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరే సమయంలో కలిసిన వారందరికీ వైరస్‌ సోకే ప్రమాదం ఉన్నా కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. వాహనాలపై ఒంటరిగా వచ్చిన వారు అదే వాహనంపై ఒంటరిగా తిరిగి వెళ్తున్నారు. బస్సుల్లో, ఆటోల్లో వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరే వరకూ వారికి వ్యాధి సోకిందనే విషయాన్ని ఎవరికీ తెలియనివ్వడం లేదు.

ఇంటి వద్దే రక్షణ..
కోవిడ్‌ బారిన పడిన వారు 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలి. కుటుంబ సభ్యులను సైతం కలవకూడదు. కానీ అయిదారు రోజులు ఇంట్లో గడిపి లక్షణాలు తగ్గగానే బయటకు తిరుగుతున్నారు. కానీ కచ్చితంగా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని, తర్వాత కోవిడ్‌ పరీక్ష చేయించుకుని నెగిటివ్‌ వస్తేనే బయట తిరగాలని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. సభలు, సమావేశాలు, శుభకార్యాలు, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలు, రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దని విస్తృత ప్రచారం చేసినా కనీసం పట్టించుకోడం లేదు. సమూహాల్లో కలిసి, ఎక్కువ సమయం గడిపి తిరిగి వచ్చిన వారిలోనే పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్యారోగ్య శాఖాధికారులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరై వెళ్లాల్సి వస్తే మాస్కు, భౌతిక దూరం, శానిటైజర్లు వినియోగించాలని సూచిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top