150 గ్రామాల్లో కరోనా ఘంటికలు

Coronavirus Is Spreading In 150 Villages In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుతున్నప్పటికీ 150 గ్రామాల్లో మాత్రం వైరస్‌ విజృంభిస్తోందని, ఏడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా వీరవిహారం చేస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కేసుల పెరుగుదల, వాటి ని యంత్రణ కోసం ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ క్యార్యదర్శి రిజ్వీ నేతృత్వం లో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి. శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ డాక్టర్‌ తాడూరి గంగాధర్, డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి 3 రోజులపాటు హెలికాప్టర్‌లో సుడిగాలి పర్యటన చేశారు.

ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆ ప్రాంతాల్లో కరోనా విజృంభించడానికి గల కారణాలపై సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేశారు. మంత్రివర్గ సమావేశం సందర్భంగానే పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కరోనా విజృంభిస్తున్న ఏడు జిల్లాలకు ప్రభుత్వం ఒక్కో నోడల్‌ ఆఫీసర్‌ను నియమించింది. 

నివేదికలోని అంశాలు ఇలా... 
►ప్రజలు మాసు్కలు ధరించకపోవడం, ఏపీ సరిహద్దుల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ పరిధిలోని హాలియా, త్రిపురారం, పెద్దవూరల్లో కేసులు పెరుగుతున్నాయి. 
►మిర్యాలగూడ పరిధిలోని అల్లగడప, వేమునాలపల్లి, దామరచర్లలో ఉన్న రైస్‌ మిల్లులు, పవర్‌ ప్లాంట్‌ వర్కర్లలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల వారే. తరచూ ప్రయాణాలు సాగిస్తుండటం వల్ల అక్కడ కరోనా విజృంభిస్తోంది.
►నకిరేకల్‌ పరిధిలోని పనగల్, ఒగుడు, రాములబండ, మంచెర్లగూడ ప్రాంతాల్లో జాతర, పెళ్లిళ్లు వైరస్‌ ఉధృతికి కారణం.
►సూర్యాపేట జిల్లాలో మార్కెట్‌ హడావుడి, సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఉండటం, చేపలు పట్టడం తదితర కారణాల వల్ల వైరస్‌ విజృంభిస్తోంది.
►ఖమ్మం జిల్లాలో నగరానికి చుట్టుపక్కల వైరస్‌ తీవ్రంగా ఉంది.
►మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ పరిధిలోని గార్ల, కొత్తగూడ, కోమట్లగూడెం, ఉగ్గపల్లిల్లో కరోనా పరీక్షలు తగ్గాయి.
►కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పరిధిలోని జమ్మికుంట, వీణవంక ఏరియాల్లో కేసులు, పాజిటివిటీ రెండూ పెరుగుతున్నాయి.
►మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, జైపూర్, నస్‌పూర్, చెన్నూర్‌ ప్రాంతాల్లో సింగరేణి కాలరీస్‌ యాజమాన్యం, జిల్లా వైద్యాధికారుల మధ్య సహకారం కొరవడటం, తక్కువ పరీక్షలు, సరైన వైద్య చికిత్సలు చేయడంలో వైఫల్యం వల్ల ఇక్కడ కేసులు పెరిగాయి.
►పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, గారేపల్లి, కమాన్‌పూర్, ఓదెల, శ్రీరాంపూర్, అల్లూర్‌లలో తక్కువ పరీక్షలు, వివిధ శాఖల మధ్య సహకారం కొరవడటం, పవర్‌ ప్లాంట్‌ వర్కర్ల మొబిలిటీ వల్ల కేసులు పెరిగాయి. 
►రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల అర్బన్, వేములవాడల్లో పరీక్షలు తగ్గడం, దేవస్థానానికి భక్తులు రావడం వల్ల కేసులు పెరుగుతున్నాయి.
►వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ, కమలాపూర్‌ ప్రాంతాల్లో జనం తాకిడి పెరగడం, మాస్‌్కలు ధరించకపోవడం వల్ల అధిక కేసులు.

సిఫార్సులు... 
అన్నిచోట్లా కరోనా పరీక్షలు, ఫీవర్‌ సర్వే చేపట్టాలి. 
కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ను ముమ్మరంగా నిర్వహించాలి. కోవిడ్‌ క్లినిక్స్‌ను కొనసాగించాలి.  
ఈ ప్రాంతాల్లో ఏ వేరియంట్‌ వైరస్‌ విస్తరిస్తుందో తెలుసుకునేందుకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలి. వివిధ శాఖల మధ్య సహకారం పెంచాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top