ఇక ఊహించని స్థాయిలో కేసులు!

Coronavirus spread more in August - Sakshi

వచ్చే 4–5 వారాలు కీలకమన్న ప్రభుత్వం

సామాజిక వ్యాప్తి వల్ల మితిమీరిన వేగంతో  విజృంభించనున్న కరోనా వైరస్‌

మార్చి 2న ఒక కేసుతో మొదలై 50 వేలకు చేరిక

ఇక జ్వర బాధితుల గుర్తింపు, తక్షణ చికిత్సకుప్రాధాన్యం 

తర్వాతే కోవిడ్‌ టెస్టులు

వెంటిలేటర్‌ మీదకు వెళ్లనీయకుండా చూడటమే లక్ష్యం

ఎక్కడికక్కడ యాంటిజెన్‌ టెస్టులు

జిల్లా కేంద్రంగా పీహెచ్‌సీల వరకు చికిత్సల వికేంద్రీకరణ

తొలి కేసు నమోదైన మార్చి 2 నుంచి తీసుకుంటే రాష్ట్రంలో తర్వాతి నాలుగు నెలల్లో... అంటే జూన్‌ చివరికి 16,339 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కానీ జూలైలో 23 రోజుల్లోనే ఏకంగా 34 వేల పైచిలుకు కొత్త కేసులు వచ్చాయి. దీన్నిబట్టి వైరస్‌ వ్యాప్తి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వైరస్‌ ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితి. దాంతో సామాజిక వ్యాప్తి జరిగిందని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాబోయే నాలుగైదు వారాలు అత్యంత సంక్లిష్టమైనవిగా పేర్కొంది. మొత్తానికి ఆగస్టులో పరిస్థితులు ఎటు దారితీస్తాయోననే ఆందోళన నెలకొంది. 

సాక్షి, హైదరాబాద్‌ : మార్చి 2వ తేదీన రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది... ఇప్పుడు ఆ సంఖ్య 50 వేలు దాటింది. ఐదు నెలలు నిండకుండానే కేసుల సంఖ్య ఈ స్థాయికి చేరింది. మార్చి నెలాఖరుకు కేసుల సంఖ్య 77 కాగా, ఏప్రిల్‌ చివరినాటికి 1,038కి చేరుకుంది. ఆ తర్వాత మే నెలాఖరుకు 2,698కు కేసుల సంఖ్య పెరిగింది. ఇక జూన్‌ నెలాఖరుకు కేసుల సంఖ్య ఏకంగా 16,339కు చేరు కుంది. ప్రస్తుత జూలై నెలలో 23 రోజుల్లోనే (గురు వారం నాటికి) ఏకంగా 50,826 కేసులు నమోదయ్యాయి. కేవలం 23 రోజుల్లోనే 34 వేల కేసులు రావడం గమనార్హం. అలాగే మరణాలు కూడా ముమ్మరమయ్యాయి. మార్చిలో ఒకటి కాగా, ఏప్రిల్‌ చివరి నాటికి 28, మే చివరి నాటికి 80, జూన్‌ నెలాఖరుకు 260, ఈ నెల 23వ తేదీ వరకు 447కు మరణాల సంఖ్య చేరుకుంది. మరోవైపు వైరస్‌ హైదరాబాద్‌ మహానగరం నుంచి జిల్లాలకు కూడా వేగంగా విస్తరించింది. అందుకే ఈ వైరస్‌ సామాజిక వ్యాప్తి అయినట్లు ప్రకటించారు. ఇది మున్ముందు ఎంతటి విపత్తుకు దారితీస్తుందో అంతుచిక్కడంలేదు. అందుకే వచ్చే నాలుగైదు వారాలు అత్యంత సంక్లిష్టమైన రోజులని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. (కరోనా కట్టడిపై చర్యలు తీసుకోవాలి )

ఆగస్టులో ఏం జరుగబోతుంది?  
ఆగస్టు రావడానికి ఇంకా వారం రోజులుంది. ఈ వారం వ్యాప్తి రోజుల్లో ఎన్ని కేసులు నమోదవుతాయో చెప్పే పరిస్థితి లేదు. ఆ తర్వాత మొదలయ్యే ఆగస్టు నెలలో ఎన్ని కేసులు వస్తాయో ఊహించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే జూన్‌ నెలాఖరు నాటికి 16,339 కేసులు మాత్రమే ఉంటే, జులైలో కేవలం 23 రోజుల్లోనే 34 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అంటే దాదాపు మూడు వారాల్లోనే మూడు రెట్లకు మించి కేసులు నమోదయ్యాయి. ఈ నెల చివరకు అంచనా వేసుకుంటే దాదాపు నాలుగు రెట్లు కేసులు పెరిగే అవకాశముందంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆగస్టులో అల్లకల్లోలమే ఉంటుందన్న ఆందోళన వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో నెలకొంది.

పైగా ప్రస్తుతం వర్షాకాల సీజన్‌ నడుస్తోంది. దీంతో జలుబు, దగ్గు, జ్వరాలు పట్టిపీడిస్తాయి. ఫలితంగా వైరస్‌ మితిమీరిన వేగంతో దూసుకెళ్లే ప్రమాద ఘంటికలు ఉన్నాయంటున్నారు. ప్రముఖ అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ కూడా కరోనా రెండో దశ (సెకండ్‌ వేవ్‌) ఆగస్టులో ప్రారంభమై, సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు దానికి ముకుతాడు వేయకపోతే అది మరింత విషాదాన్ని మిగుల్చుతుందని హెచ్చరించింది. పైగా మున్ముందు చలికాలం కూడా తోడయ్యే పరిస్థితి ఉండటంతో వైరస్‌ వ్యాప్తికి పట్టపగ్గాలుండవు. అందువల్ల వైరస్‌ రెండో దశలోకి వెళ్లడానికి ముందే ముకుతాడు వేయాలి. లేకుంటే రాబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నది నిపుణుల అంచనా.
 
జ్వరం రాగానే తక్షణ చికిత్స... 
వైరస్‌ హైదరాబాద్‌ మహానగరం నుంచి జిల్లాలకు, ఇప్పుడు గ్రామాలకు విస్తరిస్తోంది. ఎక్కడ ఎలా కరోనా వస్తుందో అంతుచిక్కడం లేదు. ఆగస్టు కల్లోలానికి ముకుతాడు ఎలా వేయాలన్న దానిపై కొన్నిరోజులుగా వైద్య ఆరోగ్యశాఖ ముమ్మరమైన కసరత్తు చేసింది. ఇప్పటివరకు కరోనా నిర్దారణ పరీక్షలు చేయడం, పాజిటివ్‌ వచ్చిన వారిని ఇళ్లల్లోనో లేదా సీరియస్‌గా ఉంటే ఆసుపత్రుల్లోనో చేర్చి చికిత్స చేస్తున్నారు. అలాగే పరీక్షలు, చికిత్స వంటివన్నీ హెదరాబాద్‌ కేంద్రంగా కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొత్త వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించింది. వాస్తవంగా ఇప్పుడు నమోదవుతున్న కేసులన్నీ జ్వరం, జలుబు, ఇతరత్రా లక్షణాలతో ప్రారంభమై ఒక్కసారిగా సీరియస్‌గా మారిపోతున్నాయి. వైరస్‌ నిర్దారణ పరీక్ష చేసి ఫలితం వచ్చేలోగా పరిస్థితి చేయిదాటిపోతోంది. కొందరు సాధారణ జ్వరం అనుకొని డోలో వంటి మాత్రలు వేసుకుంటున్నారు. తగ్గకపోయేసరికి నిర్దారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆలస్యం జరిగేసరికి రోగికి వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌గా మారి ఊపిరితిత్తులను దెబ్బతీస్తోంది. అలాంటి కేసులు ఆసుపత్రుల వరకు వచ్చి, వెంటిలేటర్‌పైకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి వస్తే ఏమేరకు కాపాడగలమన్నది ప్రశ్న. అలాంటి వాటిల్లోనే మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని రచించింది. 

ఎవరికి జ్వరం వచ్చినా కరోనా నిర్దారణ పరీక్షకంటే ముందే వారిని ఇంటింటికి వెళ్లి గుర్తించాలి. లేదా బాధితుడు తక్షణం సమీప డాక్టర్‌ను సంప్రదించేలా ప్రణాళిక రచించారు. జ్వరం వచ్చిందంటే చాలు నిర్దారణ పరీక్ష కంటే ముందే కరోనాకు ఇప్పుడిస్తున్న చికిత్సను తక్షణమే ప్రారంభిస్తారు. ఇన్‌ఫెక్షన్‌ రాకుండా యాంటిబయోటిక్స్, జ్వరం, దగ్గు, జలుబు తగ్గేందుకు, రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఇస్తున్న కిట్లను అందజేసి చికిత్సను ప్రారంభిస్తారు. ఆ సమయంలోనే కరోనా నిర్దారణ పరీక్ష చేస్తారు. ఇలా తక్షణం చికిత్స చేయడం ద్వారా కరోనాతో ఇన్‌ఫెక్షన్‌ రాకుండా రోగిని కాపాడుకోగలిగే పరిస్థితి ఉంటుందని వైద్య వర్గాలు తెలిపాయి. దాంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో విరివిగా యాంటిజెన్‌ టెస్ట్‌లు చేస్తారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) స్థాయి నుంచీ నిర్దారణ పరీక్ష, చికిత్సలు అందించే ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న కరోనా పరీక్షలు, చికిత్సలు జిల్లా, మండల స్థాయి వరకు ఇలా వికేంద్రీకరణ అవుతాయి. ఈ వ్యూహంతో కరోనాను కట్టడి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. జ్వరం వచ్చిన వ్యక్తి ఇన్‌ఫెక్షన్‌కు గురై వెంటిలేటర్‌ మీదకు రాకుండా చేయడమే ఇప్పుడున్న ప్రధాన కర్తవ్యమని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కరోనా వేగానికి మించి ఇంకో నాలుగైదు అడుగులు ముందుంటేనే దాని ధాటిని ఎదుర్కోనగలమని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తికాక ముందే గుర్తించి మరణాల సంఖ్యను తగ్గించడమే ప్రధానమని అంటున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top