
సాక్షి, హైదరాబాద్: నగరంలో కోవిడ్ కేసు నమోదైంది. కూకట్‌పల్లిలో డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. వైద్యుడు నాలుగు రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్నారు. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన లేకపోవడం వంటి లక్షణాలు ఉండటంతో.. అన్నిరకాల పరీక్షలు చేయించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మరోవైపు, ఢిల్లీలో కోవిడ్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 23 కేసులు నమోదయ్యాయి.
కాగా, కోవిడ్ మొదటి వేవ్ 2020 ఏప్రిల్ నుండి 2021 మార్చి వరకు కొనసాగింది. యంత్రాంగం ఎంత కష్టపడినా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడలేదు. లాక్‌డౌన్ సడలింపు వేళలో ప్రజలు నిత్యవసరాల కోసం రావడం, ఇతర ప్రాంతాలకు వెళ్తుండడం.. ఆ సమయాన జాగ్రత్తలు పాటించకపోవడంతో కేసులు గణనీయంగా పెరిగాయి. మొదటి వేవ్‌లో కరోనా వ్యాక్సిన్ రావడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ అందించిన ప్రభుత్వం.. ఆతర్వాత అందరికీ ఇవ్వడానికి రెండేళ్లు పట్టింది.
కోవిడ్ రెండో వేవ్ 2021 ఏప్రిల్‌లో ప్రారంభం కాగా డిసెంబర్ వరకు కొనసాగింది. ఈ వేవ్‌లో తెలంగాణ వ్యాప్తంగా పరిశీలిస్తే ఖమ్మం జిల్లానే ఎక్కువ తల్లడిల్లింది. కోవిడ్ సోకిన రెండు, మూడు రోజులకే కొందరు మృతి చెందడమే కాక వృద్ధుల మరణాలు గణనీయంగా నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకలు సరిపోక చికిత్స అందకపోవడంతో గంటల్లోనే ప్రాణాలు వదలడం సాధారణంగా మారింది. దీనికి తోడు చాలాచోట్ల ఆక్సిజన్ కొరత ఏర్పడింది.
