కరోనా: ఆత్మ బంధువులు! 

Coronavirus: Korutla Group Of Youngs Social Service In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కష్టకాలం..ఎవరు ఎలా చనిపోయినా కరోనాతోనే కావొచ్చని బంధువులు కనీసం అంతిమకర్మలు నిర్వహించలేని దీనస్థితి. తోబుట్టువులు దగ్గరి బంధువులు ఎవరూ అంత్యక్రియలకు ముందుకు రాని పరిస్థితి. కరోనా మృత్యుకోరల్లో మానవత్వం కనుమరుగవుతున్న తరుణంలో కోరుట్లకు చెందిన కొంత మంది యువకులు అంత్యక్రియలు నిర్వహించడానికి సహాయకులుగా ఉండేందుకు ముందుకు వచ్చి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

పెరుగుతున్న కేసులు 
కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. ప్రతీరోజు జిల్లాలో 80–120 వర కు పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. రెండునెలల్లో సుమారు 8 మంది కరోనాతో మృతిచెందారు. జిల్లాలో సుమారు 230 మంది హోం ఐసోలేషన్, ఇంకొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. మరి కొంత మంది కరీంనగర్, హైదరాబాద్‌కు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. వరుసగా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో జనంలో భయాందోళనలు పెరిగాయి. ఈ క్రమంలో ఎవరైనా సాధారణంగా చనిపోయినా కరోనాతో చనిపోయారనే అనుమానంతో దహన సంస్కారాలకు బంధువులు కూడా ముందుకు రాని దయనీయ స్థితి నెలకొంది.  

బృందంగా ఏర్పడ్డ యువకులు
రెండు రోజుల క్రితం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఓ మహిళ కరోనా పరీక్షల కోసం వచ్చి అక్కడే కుప్పకూలి చనిపోయింది. ఆ రోజు పట్టణానికి చెందిన అబ్దుల్‌ రబ్, ఇషాక్, నసీర్‌ అలీ, అన్సార్, సోయబ్, ఇమ్రాన్‌ అనే యువకులు స్పందించి మహిళ మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలకు సహకరించారు. సోమవారం కోరుట్ల పట్టణంలోని జవహర్‌రోడ్డులో ఓ వ్యక్తి మృతిచెందాడు. అతడు కరోనాతో మృతిచెందాడనే అనుమానంతో బంధువులు ఎవరూ అంత్యక్రియల్లో పాలు పంచుకోలేదు. ఈ క్రమంలో అబ్దుల్‌ రబ్‌ బృందం వారి ఇంటికి వెళ్లి సదరు వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకుంది. సహాయకులుగా వ్యవహరిస్తున్న ఈ బృందం సభ్యులు పూర్తిస్థాయి పీపీఈ కిట్లు ధరించడంతోపాటు శానిటైజర్లు, మాస్కులు ధరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

సాయం చేయడం మానవధర్మం 
కరోనాతో చనిపోయినా, సాధారణ మరణమైనా అంత్యక్రియలకు కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో స్నేహితులతో కలిసి ఓ బృందంగా ఏర్పడ్డాం. అందరం పూర్తిస్థాయి పీపీఈ కిట్లు వేసుకుని జాగ్రత్తగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. దాతలు పీపీఈ కిట్లు ఇవ్వడానికి సహకరిస్తే మేలు చేసినవారవుతారు. – అబ్దుల్‌రబ్, కోరుట్ల 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top