రైతు కష్టాన్ని మింగేసిన పెద్దవాగు

Corn Crop Damage Due To Heavy Rain In Nizamabad District - Sakshi

వంద ట్రాక్టర్ల మక్క పంట వరదపాలు 

బాల్కొండ: నీళ్లలో, ముళ్ల పొదల్లో చిక్కుకున్న మక్కపొత్తులను తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఆ రైతులు పడుతున్న తపనకు ఈ దృశ్యాలు అద్దంపడుతున్నాయి. ఆరుగాలం శ్రమించిన రైతుకు ఎంత కష్టం, ఎంత నష్టం! వీరే కాదు, ఇలా ఎంతో మంది రైతుల కష్టాన్ని పెద్దవాగు మింగేసింది. ఆరుగాలం శ్రమ అరగంటలో మాయమైంది. నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం వెంచిర్యాల్‌ గ్రామ శివారులోనిది. గ్రామానికి చెందిన గొల్ల ఎర్రన్నకు ఒక ఎకరం భూమి ఉంది. అందులో మక్క పంటను సాగు చేశారు. ఒక ట్రాక్టర్‌ దిగుబడి రాగా దానిని నూర్పిడి కోసం ఆరబెట్టారు.

మంగళవారం కురిసిన భారీవర్షాలకు పెద్దవాగు ఉప్పొంగడంతో ఆ నీటిప్రవాహంలో ఎర్రన్న పంట మొత్తం కొట్టుకుపోయింది. బుధవారం ఇలా నీటిలోని ముళ్లపొదల్లోచిక్కుకున్న మక్క కంకులను ఏరుకునేందుకు దంపతులు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా వెంచిర్యాల్‌ రైతులకు చెందిన సుమారు 100 ట్రాక్టర్ల మక్క కంకులు తెప్పలుగా వాగులో కొట్టుకుపోయాయి.

దీంతో ఊరు మొత్తం కన్నీటిపర్యంతమవుతోంది. నీటిప్రవాహం తగ్గుముఖం పట్టడంతో కొట్టుకుపోయిన మక్కల కోసం వాగు పరీవాహక ప్రాంతాల్లో, ముళ్ల పొదల్లో, నీటిలో రైతులు వెతుక్కుంటున్నారు. ఎంత వెతికినా నష్టపోయిన దాంట్లో ఒక్క వంతు పంట కూడా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత నష్టం జరిగినా ఒక్క అధికారి కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించకపోవడం గమనార్హం. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top