రెడీమేడ్‌ గూడు.. భలేగుంది చూడు

Construction Readymade House Cost of Rs 3. 4 lakh at Asifabad - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌ (కెరమెరి): ఉండేందుకు ఇల్లు లేక.. కట్టుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక తలదాచుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆదిమ గిరిజనుల సొంతింటి కలను ఐటీడీఏ అధికారులు సాకారం చేశారు. రూ.3.4 లక్షలతో రెడీమేడ్‌ ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కుమురంభీం జిల్లా కెరమెరి మండలం బాబేఝరి గ్రామ పంచాయతీ పరిధి శివగూడలో 13 కుటుంబాలున్నాయి.

ఆదిమ గిరిజనులు (పీటీజీ) గూన, పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. దీంతో వారి కోసం ఒక్కొక్క ఇంటికి రూ.3.4 లక్షలు వెచ్చించి రెడీమేడ్‌గా 13 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఐటీడీఏ అధికారులు నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా మొదటి ఇంటిని టేకం మాణిక్‌రావు అనే లబ్ధిదారుకు నిర్మించారు. హాల్, బెడ్రూం, కిచెన్, మరుగుదొడ్లు, నేలకు రంగురంగుల టైల్స్‌ తదితర సౌకర్యాలతో ఇంటిని పూర్తి చేశారు. కిటికీలకు చలువ అద్దాలు అమర్చడంతో ఆకర్షణీయంగా ఇల్లు కనిపిస్తోంది.

ఇంటి నిర్మాణానికి 30 రోజుల సమయం పట్టిందని, 50 ఏళ్ల వరకు మన్నిక ఉంటుందని ఐటీడీఏ ఏఈ నజీమొద్దీన్‌ తెలిపారు. మిగతా ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అందమైన ఇంట్లో నివసించాలనే కల నెరవేరనుండటంతో ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top