10 అంతస్తులు దాటితే టీడీఆర్ తప్పనిసరి నిబంధన
సామాన్యుని సొంతింటి కలను మరింత దూరం చేసిన సర్కారు
10–25 శాతం పెరగనున్న అపార్ట్‌మెంట్ల ధరలు
ప్రస్తుతం మార్కెట్‌లో సుమారు 232 ఎకరాల టీడీఆర్ సర్టీఫికెట్లు
కొత్త ప్రాజెక్టుల లాంచింగ్‌కు డెవలపర్ల వెనుకడుగు
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారులపై రాష్ట్ర సర్కారు అభివృద్ధి బదలాయింపు హక్కు (టీడీఆర్) పిడుగు వేసింది. 10 అంతస్తులు దాటి నిర్మించే అన్ని రకాల భవనాలకు 10 శాతం టీడీఆర్ తప్పనిసరిగా విధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పెరిగిన భూముల ధరలు, నిర్మాణ సామగ్రి, తదితరాలతో అపార్ట్‌మెంట్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. తాజాగా ‘తప్పనిసరి’నిబంధన భారం కొనుగోలుదారులపైనే పడుతుంది. అపార్ట్‌మెంట్ల ధరలు 10–25 శాతం మేర పెరుగుతాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. దీంతో సామాన్యుని సొంతింటి కల మరింత దూరం కానుంది.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధి వరకూ 10 శాతం టీడీఆర్ తప్పనిసరి నిబంధన వర్తిస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం బేగంపేట, శేరిలింగంపల్లి, రామాంతాపూర్, గండిపేట, మదీనాగూడ, కోకాపేట ఇలా నగరవ్యాప్తంగా 1,940 టీడీఆర్ సర్టీఫికెట్లు జారీ చేసింది. సుమారు 232 ఎకరాల టీడీఆర్ స్థలం అందుబాటులో ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థలతోపాటు ప్రభుత్వ పెద్దల సన్నిహితులు సిండికేట్లుగా మారి నయానో భయానో పెద్ద మొత్తంలోనే టీడీఆర్‌లను సమీకరించినట్టు ప్రచారం సాగుతోంది. తమ వారి ప్రయోజనాల కోసమే తాజాగా ప్రభుత్వం ‘తప్పనిసరి’నిబంధన తీసుకొచి్చందనే విమర్శలున్నాయి. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి విపరీతంగా రేట్లు పెంచుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అధిక ధర పెట్టి టీడీఆర్‌ను కొంటున్నారు. దీంతో ఈ భారం కస్టమర్ల మీదనే పడనుంది.
టీడీఆర్ ప్రభావం ఎంతంటే?
ఎవరైనా బిల్డర్ కూకట్‌పల్లి, నానక్‌రాంగూడ వంటి ప్రాంతాల్లో 50 అంతస్తుల భవనం ప్లాన్ చేస్తున్నారనుకుందాం. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ విలువ గజానికి రూ.44,900గా ఉంది. అంటే చదరపు అడుగుకు రూ.4,989. ఈ ప్రాంతంలో భూముల ధరలు అధికంగా ఉంటాయి కాబట్టి డెవలపర్లు ఎకరానికి నాలుగున్నర లక్షల చ.అ. బిల్టప్ ఏరియా నిర్మిస్తుంటారు. 50 అంతస్తుల నిర్మాణంలో 10 అంతస్తుల తర్వాతి నుంచి అంటే 11వ ఫ్లోర్ నుంచి 50 ఫ్లోర్ వరకూ మొత్తం బిల్టప్ ఏరియాపై 10 శాతం టీడీఆర్ తప్పనిసరి చెల్లించాలి. ఈ లెక్కన మొదటి 10 అంతస్తుల బిల్టప్ ఏరియా 90 వేల చ.అ.ను తీసివేయగా... 3.60 లక్షల చ.అ. బిల్టప్ ఏరియా మిగులుతుంది.
ఇందులో 10 శాతం బిల్టప్ ఏరియాకు 10 శాతం టీడీఆర్ తప్పనిసరి చేశారు. అంటే 36 వేల చ.అ.లకు 10 శాతం టీడీఆర్ చెల్లించాలన్నమాట. ఈ లెక్కన ఎకరానికి టీడీఆర్ రూ.17.96 కోట్లు అవుతుందన్నమాట. ఇక దీనికి జీఎస్టీ రూ.3.23 కోట్లు. మొత్తం కలిపి రూ.21.19 కోట్లు అదనపు భారం పడుతుందన్నమాట. దీనిని చ.అ.ల చొప్పున లెక్కిస్తే.. చ.అ.కు రూ.471 పెరుగుతుందన్నమాట. ఇదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో అయితే ఎకరాకు టీడీఆర్ భారం (జీఎస్టీ కలిపి) రూ.9.91 కోట్లు, కోకాపేట, నియోపొలిస్ ప్రాంతాల్లో రూ.6.79 కోట్లు అవుతుంది.
ఈ ప్రాంతాల్లో ప్రభావం..
గతేడాది గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ విభాగాలు సుమారు 350 హైరైజ్ ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేశారు. వీటిల్లో 20 అంతస్తుల కంటే ఎత్తయిన భవన నిర్మాణాలే అధికంగా ఉంటాయి. తాజాగా ‘తప్పనిసరి’ నిబంధనతో కొత్త ప్రాజెక్ట్‌లపై టీడీఆర్ ప్రభావం భారీగానే ఉంటుందని డెవలపర్ల సంఘాలు వాపోతున్నాయి. ప్రధానంగా మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కోకాపేట, నార్సింగి, గండిపేట, బండ్లగూడ జాగీర్, కూకట్‌పల్లి, శంకర్‌పల్లి, నల్లగండ్ల, తెల్లాపూర్, పుప్పాలగూడ, ఉప్పల్, ఎల్బీనగర్, కొంపల్లి, మోకిలా వంటి ప్రాంతాల్లో భవన నిర్మాణాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. టీడీఆర్‌లను కొనుగోలు చేయడానికి, వినియోగించుకోవడానికి అగ్ని మాపకశాఖ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) తప్పనిసరి అనేది ప్రధాన అడ్డంకిగా మారిందని బిల్డర్లు వాపోతున్నారు. భూ విస్తీర్ణం ఎకరం దాటిన భూములకు టీడీఆర్ జారీ దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనకు పంపాలనే నిబంధనను పెట్టారు. అయితే ఇది కాలయాపనే తప్ప మరొకటి కాదని చెబుతున్నారు.
టీడీఆర్ అంటే ఏంటి?
రోడ్లు, డ్రైనేజీలు, ఫ్లైఓవర్లు వంటి మౌలిక వసతుల నిర్మాణం సమయంలో ప్రభుత్వానికి భూ సేకరణ తప్పనిసరి. భూములు కోల్పోయే బాధితులకు ప్రభుత్వం నగదు రూపంలో పరిహారం అందిస్తుంది. అయితే ప్రభుత్వం వద్ద నిధులు కొరత ఏర్పడటంతో గత ప్రభుత్వం టీడీఆర్ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో నగదు బదులుగా అదనపు నిర్మాణ హక్కులను కల్పిస్తూ ఇచ్చేవే టీడీఆర్ సర్టిఫికెట్లు. వీటిని సదరు యజమాని సొంతానికి వాడుకోవచ్చు లేదా ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. రోడ్డు విస్తరణకు భూమి విలువలో 400 శాతం, చెరువులు, జల వనరుల అభివృద్ధికి 200 శాతం, వారసత్వ భవనాలకు 100 శాతం విలువతో ఆస్తి కోల్పోయిన వారికి టీడీఆర్‌లను జారీ చేస్తారు.
టీడీఆర్ గణాంకాలివీ
ఇప్పటి వరకు జారీ చేసిన టీడీఆర్ సర్టీఫికెట్ల సంఖ్య: 1,940
మొత్తం టీడీఆర్ స్థలం: 11,22,999.60 గజాలు
వినియోగించిన టీడీఆర్: 92,44,422.41 గజాలు
ఇంకా మిగిలిన టీడీఆర్: 1,98,551.19 గజాలు


