స్నేహ‘హస్తం’.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రులకు కాంగ్రెస్‌ మద్దతు..!

Congress To Support Independent In Telangana Local Bodies MLC Elections - Sakshi

ఆదిలాబాద్‌లో స్వతంత్ర అభ్యర్థిని పుష్పారాణికి మద్దతు 

నల్లగొండ, కరీంనగర్‌ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జనలు 

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనే పోటీకి పరిమితమైన కాంగ్రెస్‌.. మిగిలిన చోట్ల స్వతంత్రులకు మద్దతు ప్రకటించాలని యోచిస్తోంది. ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో పార్టీ అభ్యర్థులున్న నేపథ్యంలో ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్‌లోని రెండు స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై పార్టీ నాయకత్వం సీరియస్‌గా ఆలోచిస్తోం ది. అన్ని జిల్లాల్లో పార్టీ తరఫున స్థానిక ప్రజాప్రతి నిధులు ఉన్నందున వారిని కాపాడుకునేందుకు పరోక్షంగానైనా పార్టీ బరిలో ఉండాలనే ప్రతిపాదనను సీనియర్లు తెరపైకి తెస్తున్నారు.

ఈ నేపథ్యం లో ఆదిలాబాద్‌లో స్వతంత్ర అభ్యర్థిని పుష్పారాణికి అధికారికంగానే కాంగ్రెస్‌ మద్దతిస్తోంది. అయితే నల్లగొండలో స్వతంత్రులకు మద్దతివ్వడం పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. బరిలో ఉన్న ఆరుగురు స్వతంత్రుల్లో ఇద్దరు కాంగ్రెస్‌ జెడ్పీటీసీలే ఉన్నారు. కుడుదుల నగేశ్‌(ఆలేరు), వంగూరి లక్ష్మయ్య (నల్ల గొండ)లు కాంగ్రెస్‌ గుర్తుపైనే గెలిచారు. ఈ నేప థ్యంలో వారికి పార్టీ బీ–ఫారం ఇవ్వకుండా స్వతంత్రుల కోటాలో మద్దతు ప్రకటించడం సమస్యలు తెస్తుందనే భావన వ్యక్తమవుతోంది.

దీనిపై  కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. కరీంనగర్‌లో స్వతంత్ర అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల మద్దతు ఉండటం తో మరో అభ్యర్థికి మద్దతిచ్చే అంశాన్ని టీపీసీసీ యోచిస్తోంది. ఎన్నికలు జరిగే నాటికి ప్రతి చోటా ఒక అభ్యర్థికి పార్టీ పక్షాన మద్దతు ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేత ఒకరు వెల్లడించారు.    
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top