జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధిస్తామనే ధీమాతో కాంగ్రెస్
పోల్ మేనేజ్‌మెంట్ పక్కాగా జరిగిందని అంచనా
పోలింగ్ శాతం మరికొంత పెరిగి ఉండాల్సిందనే అభిప్రాయం
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఆరా తీసిన సీఎం, మంత్రులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు తమ దేనన్న ధీమా అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కనపడుతోంది. అటు పోలింగ్ సరళి, ఇటు పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఉప ఎన్నికలో కచ్చితంగా విజయం సాధిస్తామని ఆ పార్టీ నేతలంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి పోలింగ్ ముగిసేంత వరకు పార్టీ పరంగా అమలు చేసిన వ్యూహాలన్నీ సఫలమయ్యాయని చెబుతున్నారు. ముఖ్యంగా పోల్ మేనేజ్‌మెంట్ పక్కాగా జరిగినట్లు పోలింగ్ సరళి చెబుతోందని అంటున్నారు. మిత్రపక్షమైన ఎంఐఎం మద్దతు, పార్టీ కేడర్ సహకారంతో తమ అభ్యర్థి నవీన్‌కుమార్ యాదవ్‌కు 10వేల ఓట్ల మెజార్టీ లభిస్తుందనే ధీమా గాంధీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
స్థానికతకు తోడు అభివృద్ధి నినాదం, మంత్రుల మోహరింపు, సీఎం ప్రచారం, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల బలహీన తలు, ముస్లిం మైనార్టీల మద్దతు తమకు అనుకూలంగా మారిందని చెబుతున్నారు. అయితే, బీఆర్‌ఎస్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురైందనే అభిప్రాయంతో వారు ఏకీభవిస్తు న్నారు. కాగా, మంగళవారం ఉదయం పోలింగ్ మొదలైన సమయం నుంచి ముగిసేంతవరకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఉప ఎన్నిక కోసం ఇన్‌చార్జులుగా నియమితులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు ఎప్పటికప్పు డు పోలింగ్ సరళిని ఆరా తీశారు. స్థానిక నేతలతో మాట్లా డుతూ పోలింగ్ ప్రక్రియలో ఇబ్బందుల్లేకుండా, తమ ఓట ర్లను పోలింగ్ స్టేషన్లకు చేర్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
పెద్ద మెజార్టీతో గెలుస్తున్నాం: పీసీసీ చీఫ్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకా ల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు తమకు మద్దతిచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పా రు. తమ అభ్యర్థి నవీన్‌కుమార్ యాదవ్ పెద్ద మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని, ఈ ఎన్నికలో కష్టపడి పనిచేసిన పార్టీ నేత లు, కార్యకర్తలందరికీ ఆయన ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.


