Telangana: విలీనం.. విమోచనం.. సమైక్యత!

Competition Programs In Telangana Today Amit Shah And KCR Meetings  - Sakshi

నేడు తెలంగాణలో పోటాపోటీ కార్యక్రమాలు.. హైదరాబాద్‌లో అమిత్‌షా, కేసీఆర్‌ సభలు

లెఫ్ట్‌ ర్యాలీలు.. పాతబస్తీలో ఎంఐఎం సభ

సెప్టెంబర్‌ 17పై ఎవరి దారి వారిదే

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో సెప్టెంబర్‌ 17 చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. హైదరాబాద్‌ సంస్థానం నిజాం నుంచి దేశంలో అంతర్భాగమైన తేదీకి ఒక్కో పార్టీ ఒక్కో భాష్యం చెబుతూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఇన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించలేదు. ఈసారి మాత్రం పోటాపోటీ కార్యక్రమాలకు దిగాయి. నిజాం నుంచి తెలంగాణ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేసింది కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వమని ఆ పార్టీ నేతలు చెబుతుంటే.. నిజాం అరాచకాల నుంచి సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ విమోచనం కలిగించారని బీజేపీ పేర్కొంటోంది.

విలీనం, విమోచనం కాకుండా టీఆర్‌ఎస్‌ దీన్ని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించింది. ఎంఐఎం కూడా సమైక్యతా దినోత్సవంగా పరిగణించాలని కోరింది. వామపక్షాలు దీన్ని విలీనంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణలో ఆయా పార్టీలు నిర్వహించే కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.

విమోచన దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు.  హైదరాబాద్‌ సంస్థానంలో భాగంగా ఉన్న కర్నాటక, మహారాష్ట్రలోని ప్రాంతాలు కూడా విమోచనం పొందినందున ఆయా రాష్ట్రాల సీఎంలు  పాల్గొంటున్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తోంది. ఉదయం పబ్లిక్‌గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్డు నుంచి ఎన్టీఆర్‌ గ్రౌండ్స్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో గాంధీ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ తల్లి నమూనాను కూడా ఆవిష్కరించనున్నారు.

వామ పక్ష పార్టీలు ర్యాలీలు నిర్వహించనున్నాయి. 

ఎంఐఎం ఆధ్వర్యంలో పాతబస్తీలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top