Telangana: హైకోర్టుకు కొత్త జడ్జీలు

Collegium Recommends 7 Names For Judges in Telangana High Court - Sakshi

కేంద్రానికి ఏడుగురి పేర్లను ప్రతిపాదించిన సుప్రీంకోర్టు కొలీజియం 

పదోన్నతుల ద్వారానే ఎంపిక 

ఇందులో నలుగురు మహిళా న్యాయమూర్తులే.. 

రాష్ట్రపతి ఆమోదం రాగానే నియామకం 

సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు రానున్నారు. సీనియర్‌ జిల్లా జడ్జి స్థాయి నుంచి హైకోర్టు జడ్జిగా ఏడుగురికి పదోన్నతులు కల్పించాలం టూ.. సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ జాబితాలో సీనియర్‌ జిల్లా జడ్జీలు పి.శ్రీసుధ, డాక్టర్‌ సి.సుమలత, డాక్టర్‌ జి.రాధారాణి, ఎం.లక్ష్మణ్, ఎన్‌.తుకారాంజీ, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఆదాయపన్ను శాఖ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ అథారిటీ (ఐటీఏటీ) సభ్యురాలిగా ఉన్న టి.మాధవీదేవి ఉన్నారు. ఏడుగురు కొత్త న్యాయమూర్తుల్లో నలుగురు మహిళా జడ్జీలే ఉండటం విశేషం. సుప్రీం కొలీజియం పంపిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించగానే.. కొత్త జడ్జీల నియామక ప్రక్రియ పూర్తికానుంది. 

పోస్టుల సంఖ్య పెంచాక.. 
తెలంగాణ హైకోర్టులో జడ్జి పోస్టుల సంఖ్య 24గా ఉండేది. ఇటీవలే పోస్టుల సంఖ్యను 42కి పెంచారు. ప్రస్తుతం కేవలం 12 మంది న్యాయమూర్తులే ఉండగా.. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా ఏడుగురు రానున్నారు. వాస్తవానికి జిల్లా జడ్జీల నుంచి సీనియారిటీ ఆధారంగా హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. కానీ చాలా ఏళ్లుగా పదోన్నతులు ఇవ్వలేదు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడ్డాక ప్రతిపాదన వచ్చినా అమల్లోకి రాలేదు. తాజాగా జడ్జి పోస్టుల సంఖ్యను పెంచిన నేపథ్యంలో పదోన్నతులతో కొత్త నియామకాలు చేపట్టారు. ప్రస్తుతం హైకోర్టులో 2.32 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త జడ్జీలు వస్తే విచారణల వేగం పెరగనుంది. 

కొత్త న్యాయమూర్తులు వీరే.. 
1. పి.శ్రీసుధ 1967 జూన్‌ 6న జన్మించారు. తొలుత నిజామాబాద్‌ అదనపు జిల్లా జడ్జిగా, 2002లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. విజయవాడ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా, విశాఖపట్నం, వరంగల్, నిజామాబాద్‌ జిల్లాలు, సిటీ సివిల్‌ కోర్టుల చీఫ్‌ జడ్జిగా, ఉమ్మడి ఏపీ జ్యుడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం కోఆపరేటివ్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా ఉన్నారు. 

2. డాక్టర్‌ సి.సుమలత 1972 ఫిబ్రవరి 5న నెల్లూరు జిల్లాలో జన్మించారు. 2006లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. మదనపల్లి, కర్నూలు, గుంటూరు జల్లాల్లో న్యాయమూర్తిగా, ఉమ్మడి జ్యుడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా ఉన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడం ఎలా అన్న అంశం ఆమె డాక్టరేట్‌ చేశారు. 

3. డాక్టర్‌ జి.రాధారాణి 1963 జూన్‌ 29న జన్మించారు. ఏలూరులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 2008లో జిల్లాజడ్జిగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని పలు కోర్టుల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చీఫ్‌ జడ్జిగా ఉన్నారు. 

4. వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఎం.లక్ష్మణ్‌ 1965 డిసెంబర్‌ 24న జన్మించారు. హైదరాబాద్‌లోని పలు కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని పలు కోర్టుల్లో, ఖమ్మం జిల్లా చీఫ్‌ జడ్జిగా పనిచేశారు. ప్రస్తుతం లేబర్‌ కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 

5. ఎన్‌.తుకారాంజీ 1973 ఫిబ్రవరి 24న జన్మించారు. విద్యాభాస్యం మొత్తం హైదరాబాద్‌లో సాగింది. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, రాజమండ్రి జిల్లాల చీఫ్‌ జడ్జిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ క్రిమినల్‌ కోర్టుల మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా ఉన్నారు. 

6. ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి 1961 ఏప్రిల్‌ 1న జన్మించారు. 1994లో జడ్జిగా ఎంపికయ్యారు. రంగారెడ్డి జిల్లాతోపాటు పలు జిల్లాల్లో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. 

7. పి.మాధవిదేవి ఆదాయ పన్నుశాఖ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఐటీఏటీ) జ్యుడిషియల్‌ సభ్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top