
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ నర్సింహారావు
కలెక్టర్ సంతకం ఫోర్జరీ
40 మంది నిరుద్యోగులకు టోకరా
ఒకరి అరెస్ట్..పరారీలో ఇద్దరు
హనుమకొండ ఏసీపీ నర్సింహారావు వెల్లడి
హసన్‌పర్తి: ఉద్యోగాల పేరిట నకిలీ నియామక పత్రాలు సృష్టించి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద సంతకం ఫోర్జరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. నగరంలోని రామన్నపేటకు చెందిన మంద శ్రీనివాస్, బల్దియా కార్యాలయంలో హెల్త్ జవాన్‌గా విధులు నిర్వహించేవాడు.
శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందడంతో అతడి కుమారుడు మంద కల్యాణ్‌కు ఉద్యోగం ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు కల్యాణ్ హెల్త్ జవాన్‌గా విధులు నిర్వహించాడు. అయితే జల్సాలకు అలవాటు పడి ఉద్యోగాన్ని వదిలివేసిన అతడికి ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో వరంగల్ కలెక్టరేట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, తెలిసిన వారి నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. అలా 40 మంది వద్ద నుంచి సుమారు రూ.16.14 లక్షలు వసూలు చేశాడు.
ఫోర్జరీతో నకిలీ నియామక పత్రాలు
ఈ క్రమంలో కల్యాణ్ నకిలీ నియామక పత్రాలతో పాటు సర్విస్ బుక్స్ కూడా తయారు చేసి, వాటిపై వరంగల్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నిరుద్యోగులకు అందజేశాడు. ఈ పనిలో అతనికి కూరపాటి భవ్యకిరణ్, మంద వంశీ అనే వ్యక్తులు సహరించారు. అయితే కల్యాణ్ చేసిన మోసాన్ని తెలుసుకున్న బాధితులు సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి విచారణ చేపట్టారు. కాగా, సోమవారం నిందితుడు మంద కల్యాణ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడి నుంచి 39 నకిలీ సర్విస్ బుక్స్, 23 నకిలీ నియామక పత్రాలు, బైక్, కారు, మొబైల్ ఫోన్ స్వా«దీనం చేసుకున్నట్లు వివరించారు. తర్వాత నిందితుడిని కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.