
సాక్షి, నాగర్‌కర్నూల్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ని పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌లో రూ.150 కోట్లతో 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
సీఎం హెలీకాప్టర్‌లో హైదరాబాద్ నుంచి బయలుదేరి.. జటప్రోల్ చేరుకుంటారు. ముందుగా గ్రామంలోని పురాతన మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన, ఆ తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభలో ఇందిరా మహిళాశక్తి కింద స్వయం సహాయక బృందాల మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనున్నారు.