
విరాళాలిస్తే పదవులు కట్టబెడతామని ప్రలోభ పెట్టారు
చార్జిషిట్‌లో ప్రస్తావించిన ఈడీ
ఆరోపణలపై స్పందించని ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్‌తోపాటు దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లు తెరపైకి వచ్చాయి. గత నెలలో కోర్టుకు సమర్పించిన చార్జిషిట్‌లో వీరి పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తావించింది. కానీ, వీరిని నిందితులుగా చేర్చలేదు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్ గాంధీతోపాటు మరో ఐదుగురిని నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కొట్టేయడానికి కుట్ర జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఆస్తులను కాజేయాలన్న ఉద్దేశంతోనే యంగ్ ఇండియా సంస్థను స్థాపించినట్లు చెబుతోంది. ఈ సంస్థ ఏర్పాటుకు పలువురు కాంగ్రెస్ నాయకులతోపాటు ఇతరులు 2019–22 మధ్య విరాళాల రూపంలో డబ్బులు సమకూర్చారు.
అందుకు ప్రతిఫలంగా పదవులు, ప్రయోజనాలు కట్టబెడతామని ప్రస్తుత తెలంగాణ సీఎం (అప్పటి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు) రేవంత్‌రెడ్డి, పవన్ బన్సల్, అహ్మద్ పటేల్ ప్రలోభ పెట్టారని ఈడీ చార్జిషిట్‌లో పేర్కొంది. సాక్షులను విచారించిన తర్వాతే ఈ విషయం నిర్ధారించుకున్నట్లు స్పష్టంచేసింది. ఈడీ ఆరోపణలపై రేవంత్‌రెడ్డి, పవన్ బన్సల్ ఇంకా స్పందించలేదు.
ఇదిలా ఉండగా,యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటు కోసం రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చానని కాంగ్రెస్ నేత అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ ఈడీ విచారణలో అంగీకరించారు. అహ్మద్ పటేల్ సూచన మేరకే ఈ డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. కాగా, ఈడీ గతంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్‌కుమార్‌కు కూడా నోటీసులిచ్చి విచారించిన విషయం తెలిసిందే.
