
నాగర్ కర్నూల్: మాచారం, పాలమూరు ప్రాంతాలంటే తనకు ఎంతో ఇష్టమే కాకుండా ఎంతో గౌరవం కూడా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్.. ఆపై ప్రసంగించారు.‘ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలబెడతాం. పాలమూరు బిడ్డల చెమటతోనే ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ది. అచ్చంపేటలో ప్రతిరైతుకు సోలార్ విద్యుత్ అందించి తీరుతాం.
సోలార్ విద్యుత్ అందించడమే కాదు.. ఆదాయం వచ్చేలా చేస్తాం. రుణమాఫీ చేశాం.. వడ్లకు బోనస్ ఇస్తున్నాం. వరి వేసుకుంటే ఉరేనన్న దొర మాత్రం వరి వేసి అమ్ముకున్నారు. ైరైతుల కోసం ఇప్పటివరకూ రూ. 60 వేల కోట్లు ఖర్చు చేశాం. 50 లక్షల పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మహిళలే ఆర్టీసీ బస్సులు అద్దెకు తిప్పుకునేలా చేశాం.మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులకు యజమానులను చేశాం. 2029లోపు కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.