సీలింగ్ భూమిపై జడ్జితో విచారణ జరపాలి
కొల్లాపూర్: మండలంలోని ఎల్లూరు శివారులో సర్కారీ సీలింగ్ భూమిని అక్రమంగా పట్టా భూమిగా మార్చి.. దానిని కార్పొరేట్ సంస్థలకు విక్రయించిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. మంగళవారం ఆయన కొల్లాపూర్‌లో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి ఫయాజ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎల్లూరు శివారులోని సర్వే నంబర్లు 359, 363, 364, 365లో సర్కారీ సీలింగ్ భూమి ఉండగా.. వాటిని గతంలోనే దళితులకు కేటాయించారన్నారు. రైతులు సాగు చేయకపోవడంలో ఆ భూములు అడవిగా మారాయన్నారు. కొన్నేళ్ల క్రితం ఆ భూములను సురభి రాజవంశ వారసులు తమ పేరిట పట్టా భూములుగా రికార్డుల్లో ఎక్కించుకున్నారని, ఇటీవలే ఆ భూమిలో పెరిగిన భారీ వృక్షాలను కూల్చేసి కార్పొరేట్ సంస్థలకు వినియోగించారన్నారు. దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించకపోవడం దారుణమన్నారు. కార్పొరేట్ శక్తులకు విక్రయించిన భూమిని దళితులకు అప్పగించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో నాయ కులు కుర్మయ్య, ఎండీ యూసుఫ్, శివకృష్ణ, వెంకటస్వామి, కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.


