మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్‌కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిణి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీసీ నిర్వహించి పలు సూచనలు చేశారు. వీసీ అనంతరం ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, అదనపు కలెక్టర్ దేవసహాయం, మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తూ, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో 65 వార్డులు, 131 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా సజావుగా చేపట్టాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలని, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తేవాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి శిక్షకుల ద్వారా అవసరమైన శిక్షణతోపాటు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.
సిబ్బంది రాండమైజేషన్ పూర్తి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 131 మంది పోలింగ్ కేంద్రాలకు ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు కలెక్టర్ చెప్పారు. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 65 వార్డులకు గాను ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 159 మంది సిబ్బందితోపాటు అదనంగా 20 శాతం రిజర్వ్ సిబ్బంది, 629 మంది సహాయ ప్రిసైడింగ్ ఎన్నికల అధికారులు, పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేష న్ ద్వారా కేటాయించామన్నారు. స్థానికత, ప్రస్తు తం విధులు నిర్వర్తిస్తున్న అంశాలు తదితరాలను పరిగణలోకి తీసుకుని సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఈఓ రమేష్‌కుమార్, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్, వెంకటేశ్వర్లుశెట్టి, ఈడీఎం నరేష్ తదితరులు పాల్గొన్నారు.


