ముగిసిన పాలెం శ్రీవారి బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. వారం రోజులపాటు కొనసాగిన ఉత్సవాల్లో ఆలయ అర్చక బృందం స్వామివారికి నిత్యారాధన, హోమం, పూర్ణాహుతి, బలిహరణం, చక్రస్నానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం ధ్వజ అవరోహణం, పుష్పయాగం, పురవీధుల్లో శేషవాహనసేవ చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమానికి భక్తులు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు.
57 రోజులకు
చేరిన నిరసన దీక్షలు
చారకొండ: మండలంలోని గోకారం జలాశయంలో ముంపు గ్రామాలను మినహాయించి, ఆర్‌అండ్‌ఆర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని ఎర్రవల్లి గ్రామంలో చేపట్టిన నిరసన దీక్షలు 57 రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం దీక్షలో కూర్చున్న నిర్వాసితులు మాట్లాడుతూ సుమారు రెండు నెలలుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం దారుణమన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు సీఎంను ఒప్పించి ముంపు గ్రామాల మినహాయింపు, ఆర్‌అండ్‌ఆర్ నోటిఫికేషన్ రద్దు జీఓ జారీ చేసేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
క్షయ నిర్ధారణ శిబిరాలను వినియోగించుకోండి
కందనూలు: జిల్లాలో నిర్వహిస్తున్న క్షయ నిర్ధారణ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ రవికుమార్ అన్నారు. మంగళవారం ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్ మండలంలోని పుల్జాల, మల్కాపూర్ గ్రామాల్లో నిర్వహించిన క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాలను ఆయన సందర్శించి మాట్లాడారు. క్షయవ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చన్నారు. క్షయవ్యాధికి ఉచితంగా మందులతోపాటు పోషకాహార కిట్ అందజేస్తున్నామని, దీనివల్ల క్షయవ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చన్నారు. వ్యాధి సోకే అవకాశం గల మధుమేహ వ్యాధిగ్రస్తులు, ధూమపానం, మ ద్యపానం చేసేవారు, వయోవృద్ధులు, బరువు తక్కువ ఉన్నవారు, గతంలో క్షయ వ్యాధికి చికిత్స తీసుకుని కోలుకున్న వారు, క్షయ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు, తదితరులు శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కళాజాతా బృందం ద్వారా గ్రామంలో క్షయ లక్షణాలు, వ్యాప్తి, నివారణ, చికిత్స, పోషకాహారం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భవిష్య భారత్ స్వచ్ఛంద సంస్థ మేనేజర్ సబ్జెక్ట్ అలీ, ఎంఎల్‌హెచ్‌పీ ప్రీతి, ఎస్‌టీఎస్ శ్రీను, అమన్, ఏఎన్‌ఎం వనజ పాల్గొన్నారు.
అండర్–16 జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ ఈనెల 30 నుంచి సంగారెడ్డిలో హెచ్‌సీఏ అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు.
ముగిసిన పాలెం శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ముగిసిన పాలెం శ్రీవారి బ్రహ్మోత్సవాలు


