
సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్‌లో భారతి అనే అడ్వాన్స్‌డ్ హ్యూమనాయిడ్ రోబో ‘హలో సీఎం సార్’ అంటూ పలకరిస్తుంటే ఆసక్తిగా తిలకిస్తున్న రేవంత్‌రెడ్డి. ప్రశ్నలకు బదులివ్వగలనని రోబో పేర్కొనడంతో సైబర్ నేరాన్ని ఎలా రిపోర్టు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు అడగ్గా 1930 నంబర్‌కు కాల్ చేయాలని రోబో బదులిచి్చంది. చిత్రంలో టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ తదితరులు
తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంది
షీల్డ్–2025 సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి
సైబర్ నేరాల దర్యాప్తులో ఆదర్శంగా ఉన్నాం
సాక్షి, హైదరాబాద్: సైబర్ భద్రతలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులోనూ దేశానికే ఆదర్శంగా ఉన్నామని చెప్పారు. ఈ తరహా నేరాలను నియంత్రించడంలో జాతీయ స్థాయిలో తెలంగాణ ముందు వరుసలో ఉందంటూ కేంద్ర ప్రభుత్వం కితాబిచి్చందని గుర్తు చేశారు. సైబర్ నేరాలు ఆకాశమే హద్దుగా కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయని, వీటిని అరికట్టేందుకు ఒక రాష్ట్రం చేసే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవని, రాష్ట్రాలన్నీ సమన్వయంతో దేశం ఒక యూనిట్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇందుకు షీల్డ్–2025 వంటి సైబర్ సెక్యూరిటీ సదస్సులు మంచి వేదికలుగా నిలుస్తాయని అన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్త ఆధ్వర్యంలో హెచ్‌ఐసీసీలో రెండురోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ‘షీల్డ్–2025 సైబర్ సెక్యూరిటీ సదస్సు’ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సీఎం మంగళవారం ప్రారంభించారు. అలాగే టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (సీఓసీ), సైబర్ ఫ్యూజన్ సెంటర్ (సీఎఫ్‌సీ), చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులను పరిష్కరించే చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం సదస్సునుద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
హెల్ప్‌లైన్ నంబర్ 1930 అందరికీ చేరాలి
‘సైబర్ నేరగాళ్లు ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు రూ.22 వేల కోట్లు కాజేసినట్టు అంచనాలు ఉన్నాయి. ప్రజల జీవన స్థితిగతులను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి ప్రమాదకరమైన పరిణామాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. ఫేక్‌న్యూస్, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తి కూడా సమాజానికి చేటు చేస్తున్నాయి. సమాజంలో కొంతమంది జరగని నేరాలు జరిగినట్టు, జరగని దాడులు జరిగినట్టు లేదా మరో రూపంలో డీప్ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారు.
ఆర్థిక నేరాలతో పాటు ఇలాంటి వాటన్నింటినీ నియంత్రించాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలను అరికట్టడానికి ఐటీ సంస్థలు, నిపుణులతో కలిసి తెలంగాణ నిబద్ధతతో పనిచేస్తోంది. ఇందులో భాగంగా సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 నిరి్వరామంగా 24 గంటలూ పనిచేస్తోంది. ఈ విషయాన్ని అందరికీ చేరవేయాలి..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాల్లో భాగంగా జాతీయ స్థాయిలో ఈ సదస్సు ఏర్పాటుకు చొరవ తీసుకున్నందుకు టీజీసీఎస్‌బీ డీజీ శిఖాగోయల్, ఇతర సిబ్బందిని అభినందించారు.
ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి: మంత్రి శ్రీధర్‌బాబు
డేటా భద్రతకు సంబంధించి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలో తెలంగాణలో కొత్త సెక్యూరిటీ పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సైబర్ నేరాలను తగ్గించడం కాకుండా ఆదిలోనే అడ్డుకట్ట వేసే వ్యవస్థ రావాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు ఏటా 10 ట్రిలియన్ డాలర్ల సొమ్ము కొల్లగొడుతున్నారని చెప్పారు. భారత్‌లో రూ.15 వేల కోట్ల వరకు దోచుకున్నారని తెలిపారు.
చాలామంది మోసపోయినా పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదన్నారు. ఒక్కసారి డబ్బులు కోల్పోతే రికవరీ కష్టమని, ప్రజలే సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోడ్రన్ పోలీసింగ్‌లో టెక్నాలజీ అత్యంత కీలకమని డీజీపీ జితేందర్ అన్నారు. సైబర్ సెక్యూరిటీ పరిశోధన, విధాన సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధిలో భవిష్యత్ సహకారాల కోసం షీల్డ్–2025 విద్యారంగ భాగస్వాములైన ఐఐటీ హైదరాబాద్, నల్సార్, ఐఎస్‌బీలతో ఎంఓయూలు కుదుర్చుకుంటున్నట్టు టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు.
కార్యక్రమంలో హోం శాఖ కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ జనరల్ రమేశ్ ఖాజా, 14 రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్ పోలీస్ అధికారులు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఐటీ, టెలికాం, రక్షణ.. ప్రజా విధాన సంస్థలు, స్టార్టప్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు బుధవారం కూడా కొనసాగనుంది.