జూబ్లీహిల్స్‌లో స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండా
ఉప ఎన్నిక వేళ దూసుకెళ్తున్న మూడు ప్రధాన పార్టీలు
కార్నర్ మీటింగ్‌లు, పాదయాత్రలు, కరపత్రాల పంపిణీ
గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్లు, పార్కుల్లో ప్రచారం
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో గేరు మార్చాయి. వీధులన్నీ రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలతో హోరెత్తుతున్నాయి. ఈ ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఎలాగైనా ఈ సీటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. స్థానిక సమస్యలే ఎజెండాగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
వీధివీధిలో పాదయాత్రలు నిర్వహిస్తూ, ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుస్తున్నారు. తమ అభ్యర్థకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్‌లతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుండగా, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు తదితరులు సైతం ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటును దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదునైన విమర్శనా్రస్తాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
మాస్ క్యాంపెయిన్‌పై దృష్టి..
ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల ప్రచార శైలికి భిన్నంగా బీజేపీ ముందుకెళుతోంది. ప్రత్యర్థి పార్టీలు కార్నర్ మీటింగ్, రోడ్ షో అంటూ పెద్దఎత్తున జన సమీకరణ చేస్తుండగా, బీజేపీ నేరుగా కాలనీల్లో ఓటర్ల ఇంటికి పాదయాత్రగా వెళుతోంది. బీజేపీ 50 మంది స్టార్ క్యాంపెయినర్లతో జాబితా విడుదల చేసింది. కార్పెట్ బాంబింగ్ అంటూ కొత్త తరహా ప్రచారానికి తెరతీసింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మాత్రం జన సమీకరణకు మొగ్గుచూపుతున్నాయి. కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారంతో నాయకులు బస్తీల్లో కలియదిరుగుతున్నారు.
పేరుకు పెద్దదే అయినా..
పేరుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అయినా ఆ రాజసం ఆ ప్రాంతంలో కనిపించదు. బస్తీల్లో గుంతలుగా మారిన అంతర్గత రహదారులు, పొంగుతున్న మురుగు నీటి పారుదల వ్యవస్థ, వెలగని విద్యుత్తు లైట్లు, పార్కులు, ఫుట్ పాత్‌ల ఆక్రమణలపై విమర్శణా్రస్తాలు సంధిస్తున్నాయి. ఈ పాపం మీదంటే మీదంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నేతలు ఒకరినొకరు నిందిస్తుండగా, ఈ దుస్థితికి ఆ రెండు పార్టీలే కారణమంటూ బీజేపీ వాదిస్తోంది. ఈసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటోంది.
ఆ ముగ్గురే కీలకం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్‌లో కేటీఆర్ ప్రచార బాధ్యతలను తీసుకున్నారు. ఇతర నేతలంతా కాలనీల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల వ్యూహాలు, జన సమీకరణ, ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేయాలి, ఎవరెవరిని గెస్ట్‌లుగా పిలవాలి తదితర అంశాలన్నీ ఆయా నేతలు చూస్తున్నారు. పార్టీ అభ్యరి్థని విజయ తీరాలకు చేర్చే బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు.


