ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy says We will complete SLBC | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తాం: సీఎం రేవంత్‌

Nov 4 2025 5:13 AM | Updated on Nov 4 2025 5:13 AM

CM Revanth Reddy says We will complete SLBC

హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ సర్వే హెలికాప్టర్‌ను తిలకిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి

ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అంతర్జాతీయ సాంకేతికతను వినియోగిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ ప్రాజెక్టును పూర్తి చేసుకోలేం 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌కు శాశ్వత పరిష్కారం చూపుతాం

మంత్రులు ఉత్తమ్,కోమటిరెడ్డితో కలిసి హెలిబోర్న్‌ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌ సర్వే పనులకు ప్రారంభం  

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టును ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేసి తీరుతామని.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ స్థాయి అధునాతన సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్, కృష్ణా నది పక్క నుంచి సొరంగం తవ్వకం అత్యంత సవాల్‌తో కూడుకున్నదని.. ఇలాంటి ప్రాజెక్టు మరెక్కడా లేదన్నారు. 

మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలసి సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ఎస్‌ఎల్‌బీసీ అవుట్‌లెట్‌ టన్నెల్‌ నుంచి హెలిబోర్న్‌ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌ సర్వేను సీఎం రేవంత్‌ ప్రారంభించారు. జాతీయ భూ¿ౌతిక పరిశోధనా సంస్థ (ఎన్జీఆర్‌ఐ) నిపుణుల ఆధ్వర్యంలో హెలికాప్టర్‌ ద్వారా చేపట్టిన సర్వేను పర్యవేక్షించిన అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. రూ. 4,600 కోట్ల అంచనా వ్యయంలోనే సర్వే పనులతోపాటు ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. 

కాంగ్రెస్‌కు పేరొస్తదనే ఎస్‌ఎల్‌బీసీ మూలకు.. 
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 20 ఏళ్లయినా ఇప్పటివరకు పూర్తి కాలేదని సీఎం రేవంత్‌ చెప్పారు. 2004లో వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం పేరిట ప్రాజెక్టు పురోగతిలోకి వచ్చినా ఆయన మరణం తర్వాత పనులు ఆగిపోయాయన్నారు. 2014 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 30 కి.మీ. మేర సొరంగ నిర్మాణం పూర్తి చేస్తే బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో 10 కి.మీ. కూడా పూర్తి చేయలేదని రేవంత్‌ విమర్శించారు. ఏడాదికో కి.మీ. చొప్పున పూర్తిచేసినా ఇప్పటికే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. 

కాంగ్రెస్‌కు పేరొస్తదని.. కమీషన్లు రావనే దురుద్దేశంతోనే కేసీఆర్‌ ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని రేవంత్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్‌ పాలనలో రూ. 1.80 లక్షల కోట్లు ఖర్చు చేశారని, అందులో రూ.1.03 లక్షల కోట్లను కాంట్రాక్టర్ల టెండర్లకే వెచ్చించారన్నారు. అయినా ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదని మండిపడ్డారు. కృష్ణాలో రాష్ట్రానికి 299 టీఎంసీలే చాలని కేసీఆర్, హరీశ్‌రావు సంతకాలు చేశారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. దీంతో తెలంగాణకు నీటి వాటాపై అడిగేందుకు అవకాశం లేదని ఏపీ వాదిస్తే తాము సుప్రీంకోర్టు, ట్రిబ్యునళ్లలో వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు.  

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ పూర్తవదు.. 
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్‌ అన్నారు. ముఖ్యమంత్రిగా తాను ఉమ్మడి పాలమూరు జిల్లాకు, మంత్రి ఉత్తమ్‌ నల్లగొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుండటం వల్ల ఈ ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఈ ప్రాజెక్టు పూర్తికాదన్నారు. తక్కువ ఖర్చుతోనే రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించే ప్రాజెక్టు మరెక్కడా లేదన్నారు. ఈ ప్రాజెక్టుతో నల్లగొండ జిల్లాలోని 30 లక్షల మంది ప్రజలకు శాశ్వత పరిష్కారంతో 3 లక్షల ఎకరాలకు 3 టీఎంసీల నీరు అందుతుందన్నారు. 

తక్కువ ఖర్చుతో గొప్ప ప్రాజెక్టు: మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి 
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు అతితక్కువ ఖర్చుతో చేపట్టిన గొప్ప ప్రాజెక్టు అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సొరంగ తవ్వకం పూర్తికి సైన్యం, జాతీయ సంస్థల సేవలనూ వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం సైన్యానికి చెందిన సొరంగ నిపుణులు కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా, హర్‌పాల్‌సింగ్‌లను రాష్ట్ర ప్రభుత్వ సలహదారులుగా డెప్యుటేషన్‌లో కేటాయించామన్నారు. 

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుండటం తమ అదృష్టమన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ నిర్మాణం కోసం టీబీఎం పరికరాలు, బేరింగ్‌ తెప్పించేందుకు తాను అమెరికా వెళ్లానని చెప్పారు. కార్యక్రమంలో ఎన్జీఆర్‌ఐ డైరెక్టర్‌ ప్రకాశ్‌కుమార్, చీఫ్‌ సైంటిస్ట్‌ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, బాలునాయక్, సీఈలు విజయ్‌భాస్కర్‌రెడ్డి, అనిల్‌కుమార్, తదితరులు హాజరయ్యారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement