CM KCR: దేశం కోసం పోరాటం 

CM KCR Speech At Wanaparthy Public Meeting - Sakshi

వనపర్తి సభలో సీఎం కేసీఆర్‌ 

తెలంగాణ తరహాలోనే శాంతి సామరస్య స్థాపన 

‘తెలంగాణ కోసం కొట్లాడినం.. తెచ్చుకున్నాం.. ముఖం కొంత తెల్లతెల్లగైంది.. ఆకలిచావులు, ఆత్మహత్యలు లేవు. కరువులు రావు.. వలసలు ఉండవు. ఇతర ప్రాంతాల వారు మనవద్దకు వచ్చి బతకాలి. ఎడారిగా ఉన్న పాలమూరులో పాలపొంగులు కనిపిస్తున్నాయి. మరింత పటిష్టమైన అభివృద్ధి చేస్తాం. దేశ రాజకీయాలను చైతన్యపరిచి బంగారు భారతదేశాన్ని తయారు చేసేందుకు పురోగమిద్దాం. వనపర్తి సభ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగుదాం’     – సీఎం కేసీఆర్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘ఈ మధ్య దేశంలో గోల్‌మాల్‌ గోవిందంగాళ్లు తయారయ్యారు. ప్రజ లకు మత, కులపిచ్చి లేపి దుర్మార్గమైన రీతిలో రాజకీయాలను మంటగలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అది జరగనివ్వను. మనందరం దేశం కోసం పోరాటం చేసేందుకు సిద్ధం కావాలి. ప్రజలంతా బాగుపడాలి’ అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. వనపర్తి జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం కేసీఆర్‌ నూతన కలెక్టరేట్‌ వెనుక భాగంలో వైద్య కళాశాల నిర్మించనున్న స్థలంలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ‘ఏ జిల్లాకు వెళ్లినా.. దేశం కోసం పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా రు. మంచిని పెంచేందుకు ప్రాణం ఇచ్చేందుకు తయారుగా ఉన్నా. బుద్ధి తక్కువ పార్టీలు, వెద వలు దేశాన్ని, భారతజాతిని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మతం, కులం అనే భయంకరమైన కేన్సర్‌ వ్యాధి మన వరకు రానివ్వొద్దు. గ్రామాల్లో ఈ విషయంపై చర్చబెట్టాలి. మత పిచ్చిగాళ్లను, బీజేపీని బంగాళాఖాతంలో బొందపెట్టాలి. వారికి బుద్ధి చెప్పేందుకు తెలంగాణ జాగృతం కావాలి’ అని కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటున్నామని ఇప్పుడు విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు.  

తెలంగాణలోకి వలసలు పెరిగాయి 
‘రాష్ట్ర సాధన కోసం 2001లో జెండా పట్టినప్పుడు ఎన్నో అవమానాలు జరిగాయి.  దేనికీ బెదరకుండా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. అన్ని జిల్లాలు అభివృద్ధి పథంలో ఉన్నాయి. చాలా సంతోషం’ అని కేసీఆర్‌ అన్నారు. ‘చాన్నాళ్ల తర్వాత ఇటీవల గద్వాలకు వచ్చినా. పాలమూరు పచ్చదనాన్ని చూద్దామని బస్‌లో వచ్చాను. దద్దమ్మ నాయకులు మధ్యలో వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి అద్భుతంగా లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చాం’ అని వివరించారు. ఎక్కడ చూసినా ధాన్యం రాశులు, కల్లాలు, పంటలు కనిపించాయని చెప్పారు. గతంలో పాలమూరు నుంచి 14–15 లక్షల మంది వలసలు వెళ్లేవారని.. ప్రస్తుతం దేశంలోని 11 రాష్ట్రాల నుంచి ప్రజలు తెలంగాణకు పనికోసం వస్తున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే 15–16 లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతాయని.. దీంతో నా పాలమూరు బంగారు తునక అవుతుందని కేసీఆర్‌ పేర్కొన్నారు.  

చదవండి: (అసెంబ్లీ వేదికగా అద్భుత ప్రకటన: సీఎం కేసీఆర్‌)

మన తలసరి ఆదాయం మిన్న: తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లే అయ్యిందని.. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి రాష్ట్రాల కంటే తెలంగాణ తలసరి ఆదాయం బాగుందని కేసీఆర్‌ వెల్లడించారు. విద్యుత్‌ వినియోగం, మౌలిక రంగాల్లో వాళ్లకంటే ముందున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ వస్తే విద్యుత్‌ ఉండదని అన్నారని గుర్తు చేశారు.  మనం ఏర్పాటు చేసుకున్న సమీకృత కలెక్టరేట్‌ భవనాలు మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా  లేవని చెప్పారు. 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాలకు ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనేనని.. దేశంలో మరే రాష్ట్రం లేదని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు దాదాపు 13వేల మెగావాట్ల పైచిలుకు పీక్‌ లోడ్‌ ఉంటే తెలంగాణలో ప్రస్తుతం 14వేల మెగావాట్ల పీక్‌ లోడ్‌ ఉందని, దీన్నిబట్టి రాష్ట్రం విద్యుత్‌ను ఏస్థాయిలో వినియోగించుకుంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. గిరిజనుల రిజర్వేషన్‌ పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే.. ప్రధాని మోదీ అడకనపెట్టి కూర్చొన్నాడని సీఎం విమర్శించారు. అదేవిధంగా వాల్మీకి బోయల డిమాండ్‌ మేరకు వారిని ఎస్టీ జాబితాలో చేర్చే విషయంలో కేంద్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు.   

సీఎం సభలో హైలైట్స్‌..
పాలమూరుపై కేసీఆర్‌ కవిత 
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు వచ్చిన సమయంలో చూసి నేను, జయశంకర్‌ సార్‌ కన్నీళ్లు పెట్టుకున్నాం. గోరటి పాటలో మాదిరిగా ఉంది. ఇప్పుడు అభివృద్ధిలో ముందంజలో ఉంది. దీనిపై నేను కవిత రాశా. ‘వలసలతో వలవల.. విలపించిన కరువు జిల్లా.. పెండింగ్‌ ప్రాజెక్టులను వడి వడిగా పూర్తి చేసి.. చెరువులన్నీ నింపి.. పన్నీటి జలకమాడిన పాలమూరు తల్లి పచ్చని పైటగప్పుకుంది..’అని కేసీఆర్‌ చదివి వినిపించారు. 

ఆడబిడ్డలకు శుభాకాంక్షలు 
‘ఈ రోజు అంతర్జాతీయ ఆడబిడ్డల దినం.. మహి ళా దినోత్సవం.. ఈ సందర్భంలో మన రాష్ట్ర, దేశ, ప్రపంచ మహిళలందరికీ నా తరఫున, మన రాష్ట్రం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నా. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా! ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో, గౌరవించబడుతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు.
 
నీళ్ల నిరంజనుడు 
వనపర్తి జిల్లా అయితదని కలలోనైనా ఊహించారా.. నిరంజన్‌రెడ్డి లాంటి మిత్రుడు నాకు ఉండటం అదృష్టంగా భావిస్తున్నా.. నీళ్ల నిరంజన్‌రెడ్డి అని మీరే అన్నారు. నిన్నటి అసెంబ్లీ సమావేశాల రోజు కూడా నా దగ్గరకు వచ్చి తండా రోడ్ల నిర్మా ణాలకు నిధులు కావాలని, కర్నెతండా లిఫ్ట్‌ కావాలని సంతకం పెట్టించాడు. ఇప్పుడు నాలుగు వరుసల బైపాస్‌ రోడ్డుకు రూ.200 కోట్లు అయినా సరే కేటాయిస్తాం.  

మర్రి, గువ్వల కొట్టేటట్టు ఉన్నారు..  
నిరంజన్‌రెడ్డి గొంతు మీద కత్తి పెట్టి నిధులు మంజూరు చేయించుకుంటడు. వనపర్తి జిల్లా బాగా అభివృద్ధి చెందింది.. సంతోషం. మర్రి, గువ్వలకు కోపం వస్తున్నట్లు ఉంది.. నన్ను కొట్టేటట్టు ఉన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. త్వరలో నాగర్‌కర్నూల్‌కు వస్తాం. 

మన ఊరు–మన బడికి శ్రీకారం 
సీఎం కేసీఆర్‌ వనపర్తిలోని జిల్లా పరిషత్‌ బాలుర హైస్కూల్లో ‘మన ఊరు–మనబడి’కి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఈ పథకానికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. నేను సైతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. ప్రభుత్వ బడులను సకల సౌకర్యాలతో అభివృద్ధిపరిచి ప్రతి విద్యార్థి నాణ్యమైన ఉన్నత చదువులు చదివేందుకు వీలుగా చేపట్టిన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం వనపర్తికి గర్వకారణమన్నారు.  

ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా
సీఎం కేసీఆర్‌ మంగళవారం మధ్యాహ్నం 12.38 గంటలకు హెలికాప్టర్‌లో వనపర్తికి చేరుకున్నారు. చిట్యాలలో వ్యవసాయ మార్కెట్‌ యార్డును ప్రా రంభించారు. అనంతరం పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో 1.21 గంటలకు మన ఊరు–మన బడి పైలాన్‌ను ఆవిష్కరించారు. స్టేజీ ఎక్కి 45 సెకన్లు మాత్రమే మాట్లాడారు. అక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి చేరుకుని 1.42 గంటలకు ప్రారంభించారు. ఆ తర్వాత నూతన సమీకృత కలెక్టరేట్‌కు చేరుకుని 1.56 గంటలకు ప్రారంభించారు. కలెక్టర్‌ యాస్మిన్‌ బాషను ఆమె సీట్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులతో సమీక్ష అనంతరం సాయంత్రం 4.15 గంటలకు వైద్య కళాశాలను ప్రారంభించారు. సాయంత్రం 4.45 గంటలకు నాగవరం శివారులో నిర్వహించిన సభాస్థలికి చేరుకున్నారు. 5.24 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top