హస్తినలో వరి యుద్ధం

CM KCR To Protest Against Central Govt Yasangi Grain purchase - Sakshi

సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో నేడు టీఆర్‌ఎస్‌ దీక్ష

కేంద్రమే ధాన్యం కొనాలనే డిమాండ్‌తో ఆందోళన  

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని జనంలోకి తీసుకెళ్లే వ్యూహం 

రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యం 

జాతీయ రాజకీయాల్లో అరంగేట్రానికి మార్గం 

దీక్షకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాట్లు పూర్తి 

నిరసనలో పాల్గొననున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు 

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ సర్కారు సిద్ధమైంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వేదికగా భారీ నిరసన దీక్ష చేపట్టింది. సీఎం కేసీఆర్‌ ఈ దీక్షలో పాల్గొని కేంద్ర వైఖరిని ఎండగట్టనున్నారు. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సహా రెండు వేల మందికిపైగా నిరసనలో పాల్గొననున్నారు. ఈ దీక్షకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఆదివారం రాత్రికే ఢిల్లీకి వచ్చారు. మిగతావారు సోమవారం ఉదయం చేరుకోనున్నారు. 

బహుముఖ వ్యూహంతో.. 
రైతుల సమస్య తీర్చడంతోపాటు రాష్ట్రంలో బీజేపీకి చెక్‌పెట్టడం, జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రానికి అనుకూలతను సృష్టించుకోవడమనే బహుముఖ లక్ష్యాలతో సీఎం కేసీఆర్‌ చేపట్టిన ఢిల్లీ దీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

దీక్ష జరిగేది ఇలా.. 
► ఢిల్లీలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి ‘తెలంగాణ రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’గా పేరు పెట్టారు. 
► ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. 
► మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు  సహా 2 వేల మంది వరకు దీక్షలో పాల్గొంటారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. 
► ‘ఒకే దేశం.. ఒకే సేకరణ విధానం’ నినాదంతో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, జెండాల ఏర్పాటు చేశారు. 

‘ఒకే దేశం.. ఒకే సేకరణ’తో.. 
తెలంగాణలో పండే యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొద్దినెలలుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. బాయిల్డ్‌రైస్‌ (ఉప్పుడు బియ్యం) తీసుకోబోమని.. రా రైస్‌ చేస్తేనే కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టం చేయగా.. ధాన్యం కొనాల్సిందేనని టీఆర్‌ఎస్‌ సర్కారు పట్టుపడుతోంది. దీనిపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లోనూ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర మంత్రుల బృందం ఇటీవల కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌తో భేటీ అయినా సానుకూల నిర్ణయం రాలేదు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ విస్తృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. సోమవారం ఢిల్లీలో ‘తెలంగాణ రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’ పేరిట ఆందోళనకు సిద్ధమైంది. ‘ఒకే దేశం.. ఒకే సేకరణ’ డిమాండ్‌తో రాష్ట్రంలో పండే ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేయనుంది. 
ఢిల్లీలో దీక్షావేదిక 

రాజకీయ వ్యూహంతోనూ.. 
ఈ నిరసన దీక్ష ద్వారా అటు రైతులకు మేలు చేసే లక్ష్యంతోపాటు.. ఇటు రాజకీయ కోణంలోనూ టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని, రైతులను ఇబ్బందిపెడుతోందని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా.. రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా పావులు కదుపుతోంది. ధాన్యం కొనుగోలు విషయంగా కేంద్ర ప్రభుత్వం వైఖరి చెప్పాలంటూ గత ఏడాది డిసెంబర్‌లో స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా కేంద్రం తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను అవమానిస్తోందంటూ ఢిల్లీలోనే దీక్ష చేపడుతోంది. ఈ దీక్ష సందర్భంగా తదుపరి కార్యాచరణను కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. 

జాతీయ రాజకీయాల్లోకి ఆరంగేట్రానికి..! 
దేశ పాలనలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందంటూ సీఎం కేసీఆర్‌ కొంతకాలంగా ప్రకటనలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలతో వరుసగా సమావేశమయ్యారు. తెలంగాణ సాధనకోసం దేశవ్యాప్తంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టి విజయం సాధించామని.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీపైనా పోరు సాగించేందుకు ముందు వరుసలో ఉంటామని కూడా ప్రకటించారు. తాజాగా ఢిల్లీ దీక్ష ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయపక్షాలు, ప్రజల దృష్టిని ఆకర్షించడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు.  

వారం రోజులుగా ఢిల్లీలోనే కేసీఆర్‌ 
పంటి నొప్పితో బాధపడుతున్న టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌.. శస్త్రచికిత్స, అనంతరం విశ్రాంతి కోసం వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఇదే సమయంలో నిరసన దీక్ష ఏర్పాట్లపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. 

అంతా గులాబీమయం 
తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌ ఢిల్లీ అంతటా కనిపించేలా ఇండియాగేట్, తెలంగాణ భవన్‌ చుట్టూ దారులను హోర్డింగులు, ఫ్లెక్సీలతో నింపేశారు. ‘ధాన్యంపై కేంద్రం మొండి వైఖరి వీడాలి, మొత్తం ధాన్యాన్ని కొనాలి, రైతులను ఆదుకోవాలి’ అనే నినాదాలను వాటిపై రాశారు. 
► తెలంగాణ భవన్‌లోని దీక్షావేదికను గులాబీ మయం చేశారు. కేసీఆర్, ఇతర నేతల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ధర్నా వేదిక, ప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్‌ పర్యవేక్షించారు. ఆదివారం ఈ ఏర్పాట్లను మంత్రులు, ఎంపీలతోపాటు ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. 
► తెలంగాణ భవన్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 
► ఢిల్లీకి వచ్చే ప్రజా ప్రతినిధులందరికీ మధ్యాహ్నం భోజనం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేయగా, రాత్రి ఎంపీ బీబీ పాటిల్‌ నివాసంలో భోజన ఏర్పాట్లు చేశారు. నేతలెవరికీ ఇబ్బందులు రాకుండా ఎంపీలు సమన్వయం చేస్తున్నారు. 
 
కేంద్రం దిగి వస్తుంది 
కేసీఆర్‌ నాయకత్వంలో చేపట్టబోయే దీక్ష చరిత్రాత్మకం అవుతుంది. వాజ్‌పేయి ప్రభుత్వహయాంలోనూ ఎఫ్‌సీఐ, కేంద్ర ఆహార మంత్రి ఇలాగే ధాన్యం కొనుగోళ్లకు నిరాకరిస్తే.. పంజాబ్‌ ప్రభుత్వం ఆందోళనకు దిగింది. కేంద్రం ముందుకొచ్చి కొనుగోళ్లు చేపట్టింది. కష్టపడి పండించిన పంటను అమ్ముకునే విషయంలో రైతులను క్షోభ పెట్టొద్దు. కేంద్రం మొండి వైఖరి వీడాలి. 
– మంత్రి నిరంజన్‌రెడ్డి 

బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు:  
రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పటికే రైతుల ఆందోళనతో బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది. ధాన్యం సేకరణ విషయంలోనూ కేంద్రం మొండి వైఖరి వీడాలి. జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానం తేవాలి. 
– ఎమ్మెల్సీ కవిత   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top