సుప్రీంకు వెళ్దామా? వద్దా?

CM KCR‌ High Level Review On 19th December - Sakshi

హైకోర్టు మధ్యంతర ఆదేశాలపై ప్రభుత్వం సమాలోచనలు 

నేడు సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష  

రెవెన్యూ, న్యాయ నిపుణుల సలహాల మేరకు నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఆధార్‌ వివరాలు అడగకుండా మాన్యువల్‌కు మార్పులు చేసే దాకా స్లాట్‌ బుకింగ్‌ను ఆపాలని గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లడమా? లేకుంటే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు తగ్గట్టుగా విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా? అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

మొదలైన నాలుగురోజులకే... 
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ముందు స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి ఆధార్, కులం వివరాలను అడగడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆస్తులు అమ్మే, కొనేవారి ఆధార్‌ నంబర్లు, కులం, కుటుంబసభ్యుల వివరాలు, వారి ఆధార్‌ నంబర్లు, సామా జిక హోదా, సాక్షుల ఆధార్‌ నంబర్లు కోరవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్లాట్‌ బుకింగ్‌కు, ప్రాపర్టీ ట్యాక్స్‌ ఇండెక్స్‌ నంబర్‌ (పీటీఐఎన్‌) నమోదుకు ఆధార్‌ వివరాలు అడగొద్దని, ఈ మేరకు స్లాట్‌ బుకింగ్‌ మాన్యువల్‌ను మార్చాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో వ్యవసాయేతర ఆస్తులు అమ్మాలనుకునే వారితో పాటు కొనే వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top