ప్రజాస్వామ్య విలువల పరిరక్షకుడు: గవర్నర్‌

CM KCR Express Condolence To EX President Pranab Mukherjee Dies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణం పట్ల గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రియతమ నేత, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణం ఎంతో బాధాకరం. దూరదృష్టి కలిగిన నేత, మంచి వక్త, రచయిత, గొప్ప పార్లమెంటేరియన్‌ అన్నింటికీ మించి గొప్ప మానవతావాది. భారతమాత ముద్దుబిడ్డ ప్రణబ్‌ మరణం కేవలం దేశానికే కాదు.. మానవాళికీ తీరని లోటు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షకుడిగా పేరొందిన ప్రణబ్‌ మరణంతో దేశం ఓ గొప్ప నేత, పాలనాదక్షుడు, మానవతావాదిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరి.. స్వర్గలోక ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’అని గవర్నర్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 

తెలంగాణతో విడదీయలేని అనుబంధం: కేసీఆర్
‌సాక్షి, హైదరాబాద్‌: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రణబ్‌ ముఖర్జీ ప్రాణాలు కాపాడటానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరం. తెలంగాణ అంశంతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం ఉంది. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారు’అని సీఎం తన సంతాప సందేశంలో గుర్తు చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌లో న్యాయం ఉందని ప్రణబ్‌ భావించేవారు. నేను కలసిన ప్రతీసారి ఎన్నో విలువైన సూచనలు చేసేవారు. ఒక నాయకుడికి ఉద్యమాన్ని ప్రారంభించి, విజయతీరాలకు చేర్చే అవకాశం దక్కడం అరుదుగా సంభవిస్తుందని, ఆ ఘనత నాకు దక్కిందని ప్రత్యేకంగా అభినందించారు. ప్రణబ్‌ రాసిన ‘ది కొయలిషన్‌ ఇయర్స్‌’పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. కేసీఆర్‌కు తెలంగాణ అంశమే తప్ప పోర్ట్‌ఫోలియో అక్కరలేదని పేర్కొన్నారు’అని ప్రణబ్‌తో అనుబంధాన్ని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. తన జీవితకాలంలో తెలంగాణ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదిగా ప్రణబ్‌ గుర్తించినట్లు అర్థమవుతోందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. యాదాద్రి దేవాలయాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారని గుర్తు చేశారు. ప్రణబ్‌ మరణం తీరని లోటని సీఎం పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తన తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ప్రణబ్‌కు నివాళి అర్పించారు. ప్రణబ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

వారం పాటు సంతాప దినాలు 
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతికి నివాళిగా వారం రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలు పాటిస్తున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. వారం రోజుల పాటు ఎలాంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని మంత్రులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేసీఆర్‌ సూచించారు. 

తెలంగాణ రుణపడి ఉంటుంది: ఉత్తమ్‌ 
సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ కురువృద్ధుడు, గొప్ప ఆర్థికవేత్త, కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీల నాయకులుగా దశాబ్దాల పాటు పనిచేసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ పని చేస్తున్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవిర్భవించిందని గుర్తుచేశారు. ప్రణబ్‌కు తెలంగాణ రాష్ట్రం రుణపడి ఉంటుందని సోమవారం ఒక ప్రకటనలో ఉత్తమ్‌ పేర్కొన్నారు. దేశంలో అనేక కీలక సమస్యలను పరిష్కరించడంలో ప్రణబ్‌ ముఖ్యపాత్ర పోషించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఉత్తమ్‌ తెలిపారు. ప్రణబ్‌ మృతి పట్ల సంతాపం తెలిపిన వారిలో రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతలు కె. జానారెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, మర్రి శశిధర్‌రెడ్డి, కోదండరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ తదితరులున్నారు.

తెలంగాణ ఏర్పాటులో ఆయనది కీలకపాత్ర: మంత్రులు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణం పట్ల మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్‌ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణపై యూపీఏ ఏర్పాటు చేసిన కమిటికీ సారథ్యం వహించిన ప్రణబ్‌.. రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో సహకరించారని గుర్తు చేసుకున్నారు. భారత రాజకీయాల్లో ప్రణబ్‌ భీష్మాచార్యులు లాంటి వారని కొనియాడారు. రాష్ట్రపతిగా తెలంగాణ బిల్లుపై సంతకం చేసి ప్రణబ్‌ కోట్లాది మంది తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరేలా చూశారని మంత్రులు నివాళి అర్పించారు. సంతాపం ప్రకటించిన వారిలో మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులున్నారు. 

సామాన్యుడి నుంచి రాష్ట్రపతి వరకు.. 
‘భారతరత్న’ప్రణబ్‌ ముఖర్జీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన సామాన్యుడి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగారు. భారత రాజకీయాల్లో అత్యంత కీలక నేతల్లో ఆయన ఒకరు. ప్రణబ్‌ దేశానికి చేసిన సేవలు మరువలేనివి.      – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి 

ఆర్థిక సంస్కరణల అమలులో కీలకపాత్ర 
ప్రణబ్‌ ముఖర్జీ లేని లోటు తీరనిది. ఆయన మరణం చాలా బాధకు గురి చే సింది. లోతైన విషయం పరిజ్ఞానమున్న ప్రణబ్‌ రాష్ట్రపతిగా, ఆర్థిక మంత్రిగా దేశానికందించిన సేవలు మరువలేనివి. ఆర్థిక సంస్కరణల అమలులో ఆయనది కీలకపాత్ర. కేంద్రమంత్రిగా ఉన్నపుడు ఆయన్ని కలసి అనేక విషయాలు చర్చించేవాడిని.  – హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ 

అజాత శత్రువు.. రాజకీయ దురంధరుడు 
ప్రణబ్‌ అజాత శత్రువు. గొప్ప రాజకీయ దురంధరుడు. నా గురు సమానులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్‌ కృషి అభినందనీయం. పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా పనిచేసిన సమయంలో ప్రణబ్‌తో ఏర్పడిన సాన్నిహిత్యం ఎంతో నేర్చుకునేందుకు ఉపయోగపడింది. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ప్రణబ్‌ ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచారు. ఆయన మరణం దేశానికే కాకుండా నాకు తీరని లోటే.  
– కె.కేశవరావు, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత 

ప్రణబ్‌ మరణం తీరని లోటు 
ప్రణబ్‌ ముఖర్జీ మరణం దేశ ప్రజలకు తీరని లోటు. రాజనీతి శాస్త్రం చదువుకున్న ఆయన అందులోని అంశాలను అక్షరాలా అనుసరించారు. వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా దేశ ప్రయోజనాలే పరమావధిగా ప్రణబ్‌ కృషి చేశారు.     – కోదండరాం, టీజేఎస్‌ అధ్యక్షుడు  

ప్రణబ్‌ మృతిపట్ల సీపీఐ నేతల సంతాపం 
సాక్షి, హైదరాబాద్‌: మాజీ రాష్ట్రపతి, బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్‌ ముఖర్జీ మృతిపట్ల సీపీఐ నాయకులు సురవరం సుధాకర్‌రెడ్డి, డా. కె.నారాయణ, అజీజ్‌పాషా, చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు సంతాపం ప్రకటించారు. సెక్యులర్‌ భావాల పట్ల నిబద్ధతతో పాటు చివరి వరకూ జాతి సమైక్యత కోసం ప్రణబ్‌ ముఖర్జీ గొప్ప కృషి చేశారని వారు నివాళులర్పించారు. 

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

అస్తమించిన అజాతశత్రువు ప్రణబ్ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top