అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

చెరువులు జాగ్రత్త..

Published Thu, Oct 22 2020 2:33 AM

CM KCR Directed The Authorities To Be Vigilant - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్‌ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌తో బుధవారం సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘హైదరాబాద్‌ నగరంలో గత వందేళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాల చెరువుల నుంచి కూడా చాలా నీరు హైదరాబాద్‌ నగరంలోని చెరువులకు చేరింది. దీంతో చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే నిండు కుండల్లా ఉన్న చెరువులకు ఇంకా వరద నీరు వస్తున్నందున గండ్లు పడటం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కనీసం 15 బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని అన్ని చెరువులను, కట్టల పరిస్థితిని పరిశీలించాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఎక్కడైనా గండ్లు పడినా, కట్టలు తెగినా వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రమాదానికి ఆస్కారమున్న చోట వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రజలను అప్రమత్తం చేయాలి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement