ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం : అంచనాలు రెట్టింపా?

CM KCR Angry Srsp Project Cost Hike Engineers - Sakshi

రూ.1,067 కోట్ల నుంచి 1,999.55 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం 

ఎలక్ట్రో, మెకానికల్‌ పనుల వ్యయాన్ని రూ.800 కోట్ల మేర పెంచారని సీఎం దృష్టికి తెచ్చిన ఓ మంత్రి 

ఇదంతా ఎలా జరిగిందో తేల్చాలంటూ రజత్‌కుమార్‌కు సీఎం ఆదేశం 

 అడ్డగోలుగా అంచనాలు పెంచితే ‘వీపులు పగులుతాయ్‌’ అంటూ ఇంజనీర్లకు హెచ్చరిక

సీఎం కేసీఆర్‌ ఆగ్రహం.. విజిలెన్స్‌ విచారణకు ఆదేశం?

సాక్షి, హైదరాబాద్‌:  ఎగువ నుంచి ప్రవాహాల్లేక నిర్జీవంగా మారిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు జవసత్వాలు ఇచ్చేందుకు చేపట్టిన ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం అంచనా వ్యయాలను ఇష్టారీతిన పెంచడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై ఆయనే స్వయంగా విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏకంగా రెట్టింపు చేయడం ఏమిటని, ఇదంతా ఎలా జరిగిందో తేల్చి సమగ్ర నివేదిక ఇవ్వాలని సాగునీటి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ను సీఎం ఆదేశించినట్లుగా ప్రభుత్వంలోని అత్యున్నత వర్గాలు వెల్లడించాయి. ఏయే పనుల కింద ఎంతమేర అంచనాలు పెరిగాయో వివరాలు ఇవ్వాలని, తప్పుడు లెక్కలుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం స్పష్టం చేశారని తెలిపాయి. 

ఎస్సారెస్పీకి జవసత్వాలు ఇచ్చేందుకు.. 
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు స్టేజ్‌–1 కింద 9.68 లక్షల ఎకరాలు, స్టేజ్‌–2 కింద 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నాయి. కానీ ప్రాజెక్టులో పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు పడిపోయింది. ఎగువన మహారాష్ట్ర ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు కట్టి నీళ్లన్నీ వాడేసుకుంటోంది. దిగువన ఉన్న ఎస్సారెస్పీకి 50 టీఎంసీల మేర కూడా నీళ్లు రాని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎస్సారెస్పీకి తరలించి జవసత్వాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి తరలించే 2 టీఎంసీల నీటిలో.. ఒక టీఎంసీ నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి 2017 జూన్‌లో రూ.1,067 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. మూడు లిఫ్టుల ద్వారా నీటిని ఎస్సారెస్పీకి ఎత్తిపోసేలా డిజైన్‌ చేశారు. 15 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

ఆరు నెలలకే మార్పులు షురూ.. 
ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం టెండర్ల ప్రక్రియ మొదలైన ఆరు నెలలకే డిజైన్‌లో మార్పులు జరిగాయి. ఈ సమయంలోనే అంచనా వ్యయాన్ని రూ.1,067 కోట్ల నుంచి.. ఏకంగా రూ.1,751.46 కోట్లకు పెంచారు. ఈ వ్యయాల మార్పు సమయంలో స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా పెరిగిన వ్యయాలను యథాతథంగా ఆమోదించారు. తర్వాత వేగంగా పనులు కొనసాగాయి. ఇప్పటికే మూడు పంపుహౌజ్‌ల నిర్మాణం పూర్తయింది. ఇరిగేషన్‌ శాఖ లెక్కల మేరకు.. ఈ పనులకు సంబంధించి రూ.1,250 కోట్లు, సబ్‌ స్టేషన్ల నిర్మాణాలకు మరో రూ.220 కోట్లు, పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లించిన మొత్తాలు మరో రూ.70 కోట్లు కలుపుకొని.. మొత్తంగా రూ.1,540 కోట్ల మేర నిధులు ఖర్చు చేసినట్టు చూపారు.

మరో రూ.150 కోట్ల మేర పెండింగ్‌ బిల్లులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రాజెక్టుపై మొత్తంగా రూ.1,700 కోట్ల వరకు ఖర్చు జరిగింది. అయినప్పటికీ ప్రాజెక్టు ఇంజనీర్లు మరోమారు అంచనాలను సవరిస్తూ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రూ.1,999.55 కోట్లతో ఈ ప్రతిపాదనలు వెళ్లినట్టు తెలిసింది. అంటే తొలి అంచనాతో పోలిస్తే ఏకంగా రూ.932 కోట్లు వ్యయం పెరిగినట్టు. రెండో సవరించిన అంచనాతో పోల్చినా కూడా రూ. 248.55 కోట్లు పెరిగిపోయింది. 

జరిగింది వేరే.. లెక్కలు వేరే.. 
మంగళవారం ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం విషయాన్ని సీఎం కేసీఆర్‌ స్వయంగా లేవనెత్తినట్టు తెలిసింది. అంచనా వ్యయం ఏకంగా రెట్టింపు కావడం ఏమిటని ఇంజనీర్లను సీఎం నిలదీయగా.. డిజైన్‌లో మార్పులు జరిగాయని, పంపుహౌజ్‌ లోతు పెరిగిందని, ఫౌండేషన్‌ సైతం తొలి ప్రతిపాదనతో పోలిస్తే మారిందని ఇంజనీర్లు చెప్పినట్టు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొన్న ఓ మంత్రి దీనిపై స్పందిస్తూ.. సివిల్‌ పనుల్లో మార్పులు జరిగితే ఎలక్ట్రో, మెకానికల్‌ పనుల అంచనాలు ఎలా పెరిగాయని ప్రశ్నించినట్టు తెలిసింది.

ప్రాజెక్టులో మొదట రూ.600 కోట్లుగా ఉన్న ఎలక్ట్రో, మెకానికల్‌ పనుల విలువ.. ఇప్పుడు ఏకంగా రూ.1,400 కోట్లకు చేరిందన్న విషయాన్ని సీఎంకు వివరించినట్టు సమాచారం. మంత్రి చెప్పిన అంశాలతో ఏకీభవించిన సీఎం.. వ్యయం పెరగడం మామూలే అయినా, ఏకంగా రెట్టింపు ఎలా అయిందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై విజిలెన్స్‌ విచారణ చేయించి, తనకు సమగ్ర నివేదిక అందించాలని.. అక్కడికక్కడే సాగునీటి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ను ఆదేశించినట్టు సమాచారం. ఈ సమయంలో ముఖ్యమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. భారీ ఎత్తున పనులు జరుగుతున్న ఇరిగేషన్‌ శాఖలో చిన్నచిన్న తప్పులు జరుగుతున్నా, ఉపేక్షిస్తూ వస్తున్నానని.. దీన్ని ఆసరాగా చేసుకొని ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అంచనా వ్యయాలను సవరిస్తే ‘వీపులు పగులుతాయ్‌’ అంటూ ఘాటుగా హెచ్చరించారని సమాచారం. 
 
ఏం జరిగింది? 

  • తొలి అంచనా వ్యయం రూ. 1,067 కోట్లు 
  • సవరించిన అంచనా మొత్తం రూ. 1,999.55 కోట్లు 
  • పెరిగిన వ్యయం:రూ.932.55 కోట్లు 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top